మునుగోడులో ఇండిపెండెట్లకు ఎన్ని ఓట్లొచ్చాయంటే...?

మునుగోడులో ఇండిపెండెట్లకు ఎన్ని ఓట్లొచ్చాయంటే...?

హైదరాబాద్: మునుగోడు బైపోల్ లో మొత్తం 47 మంది పోటీ చేశారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి తప్ప ఏ ఒక్కరూ కనీసం 5 వేల ఓట్ల మార్కును దాటలేకపోయారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు కాకుండా చిన్నా చితకా పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు చాలా మంది ఈ బైపోల్ లో పోటీ చేశారు. అయితే వారెవరూ కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. బీఎస్పీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మినహాయిస్తే మిగతా 43 మంది అభ్యర్థుల మొత్తం ఓట్లు 13,618 ఓట్లు మాత్రమే. వారిలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒక్కసారి చూద్దాం.

శంకరాచారి (బీఎస్పీ)... 4145 ఓట్లు

బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి బీసీ వర్గానికి చెందిన శంకారా చారి బరిలోకి దిగారు.  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నాక జరిగిన ఈ ఎన్నికలో గెలుపు కోసం బీఎస్పీ బాగానే కష్టపడింది. బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా ప్రధాన పార్టీలతో సమానంగా బీఎస్పీ ప్రచారం నిర్వహించింది. అయితే ఫలితాల్లో మాత్రం 4145 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 

కేఏ పాల్ (ఇండిపెండెంట్).... 805 ఓట్లు

ప్రజా శాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ కూడా మునుగోడులో పోటీ చేశారు. ప్రజా శాంతి పార్టీని ఈసీ ఇన్ యాక్టివ్ చేయడంతో కేఏ పాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ఆయన ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పాల్ చుట్టేశారు. వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తనను గెలిపిస్తే లక్షల కోట్ల రూపాయలతో మునుగోడు ప్రజలకు విద్యా, ఉద్యోగావకాశాలు కల్పిస్తానని, మునుగోడును అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఓటర్లు ఆయన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఎన్నికలో కేఏ పాల్ 805 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. 

శివకుమార్ (యుగ తులసి పార్టీ).... 1874 ఓట్లు

యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ ఈ ఎన్నికతో బాగా పాపులర్ అయ్యారు. టీఆర్ఎస్ ఫిర్యాదుతో సీఈవో వికాస్ రాజ్ ఆయనకు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును తొలగించి బేబీ వాకర్ ను కేటాయించారు. అయితే దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో సీఈవో శివకుమార్ కు తిరిగి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. టీఆర్ఎస్ నాయకుల భయపడినట్లుగానే రోడ్డు రోలర్ గుర్తుకు ఈ ఎన్నికలో 1874 ఓట్లు పోలయ్యాయి. 

మారమోని శ్రీశైలం యాదవ్ (సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి) .. 2407 ఓట్లు

సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీకి చెందిన మారమోని శ్రీశైలం యాదవ్ కూడా ఈ ఎన్నికతో ఫేమస్ అయ్యాడు. అందుకు కారణం ఆయన గుర్తు చపాతీ రోలర్. ఈ గుర్తు టీఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉంటుంది. దీంతో టీఆర్ఎస్ నేతలు ఈ గుర్తును తొలగించాలని, లేకుంటే క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉందని ఈసీకి ఫిర్యాదు చేసింది. కానీ ఈసీ వారి అభ్యర్థనను పట్టించుకోలేదు. చపాతీ రోలర్ గుర్తుతో పోటీ చేసిన శ్రీశైలం యాదవ్ కు 2407 ఓట్లు వచ్చాయి. 

ఏర్పుల గాలయ్య (ఇండిపెండెంట్... దళిత శక్తి).... 2270 ఓట్లు

ఏర్పుల గాలయ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా  మునుగోడు బరిలో దిగారు. ఈయనకు దళిత శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) సపోర్ట్ ప్రకటించింది.  గాలయ్య గెలుపు కోసం డీఎస్పీ ప్రెసిడెంట్ డాక్టర్ విశారదన్, ఇతర కార్యకర్తలు  మునుగోడులో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. రాజ్యాధికారం వస్తే తప్ప బహుజనుల బతుకులు మారవనే సిద్ధాంతంతో వారు ప్రచారం నిర్వహించారు. అయితే వారి మాటలను మునుగోడు ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఏర్పుల గాలయ్యను 2270 ఓట్లకే పరిమితం చేశారు. 

ఇంకా వీరు కాక 39 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు మునుగోడులో పోటీ చేశారు. ఇందులో 37 మంది నోటా (480 ఓట్లు)కి వచ్చినన్ని ఓట్లు కూడా సాధించలేకపోయారు. రాజేందర్ ఇస్లావత్ (502), ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు (511) మాత్రమే నోటా కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ఇక మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై  10,309 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.