
అక్రమ లేఅవుట్ల కట్టడికి కొత్త రూల్స్ పెట్టాం
వసూలైన చార్జీలతో ఆ లేఅవుట్లలో సౌలత్‌లు కల్పిస్తం
కోమటిరెడ్డి వేసిన పిల్‌ను కొట్టేయండి
హైకోర్టులో రాష్ట్ర సర్కార్ కౌంటర్
హైదరాబాద్, వెలుగు: పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు వెలిసినందున ఒక్కసారి వాటికి అవకాశం కల్పించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లేఔట్ల రెగ్యులరైజేషన్ జీవో జారీ చేసినట్లు రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు తెలిపింది. ఇకపై అక్రమ లేఅవుట్లకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామంది. అందుకే చివరిసారిగా అక్రమ లేఅవుట్లల్లో స్థలాలు కొనుగోలు చేసిన వాళ్లు నష్టపోకూడదనే రెగ్యులరైజేషన్ చేయాలని నిర్ణయించామని వివరించింది. ఎల్‌ఆర్‌ఎస్ కోసం రాష్ట్ర సర్కార్ జీవో 131 ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేసిన పిల్‌లో ప్రభుత్వ వాదనలతో మున్సిపల్,అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఎల్‌ఆర్‌ఎస్ ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదనే వాదన వాస్తవం కాదు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2007లో 902, 2015లో 151 జీవోలు జారీ అయ్యాయి. 2015లో 3.8 లక్షల అప్లికేషన్లు వస్తే వాటిలో 2.8 లక్షలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మున్సిపల్ యాక్ట్‌లో 238(1), పంచాయతీరాజ్ యాక్ట్‌లో 286, టౌన్ ప్లానింగ్ యాక్ట్‌లో 44(2), అర్బన్ డెవలప్‌మెంట్ యాక్ట్‌లో 58, హెచ్‌ఎండీఏ యాక్ట్‌లో 56(1), జీహెచ్‌ఎంసీ యాక్ట్‌లో 585ల ప్రకారం రాష్ట్రానికి ఎల్‌ఆర్‌ఎస్ జీవో ఇచ్చే అధికారం ఉంది. ఈ మేరకు ఆగస్టు 26న ప్రభుత్వం జీవో జారీ చేసింది. అన్ని పర్మిషన్ల డాక్యుమెంట్లు ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేస్తరు. ఎల్‌ఆర్‌ఎస్‌కు మంచి స్పందన లభించిందని చెప్పడానికి స్టేట్‌లో 20.44 లక్షల దరఖాస్తులు రావడమే నిదర్శనం. తెలంగాణ వచ్చాక అక్రమ లేఅవుట్లు వెలిశాయనే వాదన వాస్తవం కాదు. ఆ దరఖాస్తుల్లో 90 పర్సంట్ అప్లికేషన్స్ ఉమ్మడి ఏపీలోని లేఅవుట్లే. ఎల్ ఆర్ఎస్ ద్వారా వచ్చే డబ్బును ప్రత్యేక ఖాతాలో ఉంచి మౌలిక వసతులకు వినియోగిస్తాం. అక్రమ లేఅవుట్లు వేస్తే చర్యలు తీసుకోకుండా ఎల్‌ఆర్‌ఎస్ జీవో ఇచ్చామనే వాదన వాస్తవం కాదు. పలు మున్సిపాల్టీల్లోనే కాకుండా ఆరు జిల్లా పరిధిలోని హెచ్‌ఎండీఏలో గతేడాది 715 అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇచ్చి జాగాలను కొనుగోలు చేసిన వాళ్లు నష్టపోకుండా ఎల్‌ఆర్‌ఎస్ తేవడం జరిగింది. ఎల్‌ఆర్‌ఎస్ చేసుకున్న వాటిలో నల్లా, డ్రైనేజీ, కరెంట్, రోడ్లు వంటి సౌలత్‌లు కల్పిస్తాం. అక్రమ లేఔట్లను శాశ్వతంగా కట్టడి చేసే దిశగా ప్రభుత్వం ఇచ్చిన జీవో 131కి చట్టబద్ధత ఉన్నందున కోమటిరెడ్డి వేసిన పిల్‌ను కొట్టేయాలి’’ అని కౌంటర్‌లో సర్కార్ పేర్కొంది.
For More News..