పనిచేయని GHMC అధికారులను పంపిస్తం: మేయర్

పనిచేయని GHMC అధికారులను పంపిస్తం: మేయర్

హైదరాబాద్, వెలుగు: రెండు రోజులు జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు, అడ్వటైజ్ మెంట్, స్ర్టీట్ లైట్లు,  స్పోర్ట్స్,​ ప్రాపర్టీ ట్యాక్స్, నాలాలు, శానిటేషన్,అసెస్ మెంట్లపై చర్చించారు.  ఇందులో అధికారులు చెప్పిన సమాధానాలకు మేయర్ సహా సభ్యులు సంతృప్తి చెందలేదు. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, దీంతో బల్దియా ఆదాయం కోల్పోతుందని సభ్యులు నిలదీశారు.   అడ్వటైజ్ మెంట్ పాలసీలో లోపాలున్నాయని, శానిటేషన్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని హౌస్  కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మేయర్ హౌస్ కమిటీ వేస్తున్నట్లు, పేర్లు ఇవ్వాలని ఆయా పార్టీలను కోరారు. అలాగే లాంగ్ స్టాండింగ్, విధుల్లో నిర్లక్ష్యం, ఆరోపణలు ఉన్న అధికారులను ప్రభుత్వానికి సరెండర్ లేదా ఇతర శాఖలకు పంపాలని, తమ వద్ద కొన్ని పేర్లు ఉన్నాయని కార్పొరేటర్లు కూడా ఇలాంటి వారి వివరాలు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని మేయర్ సూచించారు.  

 స్పోర్ట్స్, నాలాలపై నిర్లక్ష్యమే..

సిటీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల్లో మెటిరీయల్ లేదని, కోచ్ లు సరిపడా లేరని పలువురు కార్పొరేటర్లు ప్రశ్నించారు. నాలాలపై అధికారులను నిలదీశారు. వెంకటేశ్వర నగర్ కాలనీలో నాలాల పనులు పెండింగ్ లోఉన్నాయని, తాను గత కౌన్సిల్ లోనూ అడిగినా ఇంకా పనులు చేయలేదని కార్పొరేటర్ మన్నె కవిత ప్రశ్నించారు. ఈఎన్ సీ జియాఉద్దీన్ సమాధానం ఇస్తూ ..ఒక్క నాలా పనికి 8 సార్లు టెండర్ వేశామని, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, తామేమీ చేస్తామన్నారు. బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు అయ్యేది తెలిసిందేనన్నారు. 

టైం, నిధులు ఇవ్వట్లేదు

 శివారు డివిజన్లకు టైం, నిధులు ఇవ్వడం లేదని మౌలాలి కార్పొరేటర్ రజిత పేర్కొన్నారు. దీన్ దయాళ్​నగర్ లో నాలాలో చిన్నారి పడి చనిపోయింది తెలిసిందేనన్నారు. అప్పటి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పుడు  సీఎంగా ఉన్నారని, ఆనాడు ఘటనపై స్పందించి పరిశీలించారని, అయినా ఆ నాలా పనులు ఇంకా  చేయలేదన్నారు. 

కుక్కల బెడద తీవ్రంగా ఉంది 

ఉప్పల్ లో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని, నాలాల నుంచి చెరువులు, కుక్కల బెడద దాకా తీవ్రంగా ఉన్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే  లక్ష్మారెడ్డి అన్నారు. ఇటీవల 10 హాస్పిటల్స్ కు వెళ్లానని,  ఎక్కడికి పోయినా  కుక్క కాటు కేసులు ఉన్నాయన్నారు. తన డివిజన్ లోనూ కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, వాటితో వృద్ధులు, పిల్లలు అందరూ ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.