రెండో విడతలో మంచి గొర్రెలు ఇస్తేనే తీసుకుంటాం

రెండో విడతలో మంచి గొర్రెలు ఇస్తేనే తీసుకుంటాం

మెదక్​ (కౌడిపల్లి), వెలుగు: రెండో విడతలో మంచి గొర్రెలు ఇస్తేనే తీసుకుంటామని యాదవ సంఘాల సభ్యులు అధికారులకు తేల్చిచెప్పారు.  కౌడిపల్లి మండలం తునికి రైతు వేదికలో సోమ వారం రెండో విడత గొర్రెల పంపిణీపై అవగాహన సమావేశం నిర్వహించారు. యాదవ సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల గొర్రెలు ఇక్కడి వాతావరణం పడక, సరిగా మేత మేయక  వచ్చిన రెండు రోజులకే చనిపోతున్నాయని వాపోయారు. మొదటి విడతలో సొంత ఖర్చులు పెట్టుకుని కర్నూల్, నంద్యాలకు వెళ్లి తెచ్చుకున్న గొర్రెలు రెండు రోజుల్లోనే మృతి చెందడంతో లబ్ధిదారులు నష్టపోయారని గుర్తు చేశారు. ఈసారి కర్ణాటక, మహారాష్ట్రలో  గొర్రెలు ఇప్పిస్తామంటున్నారని, దీనివల్ల దళారులకే లబ్ధి చేకూరుతుందన్నారు. లబ్ధిదారులే గొర్రెలు తెచ్చుకొనే అవకాశం ఇవ్వాలని కోరారు.  కార్యక్రమంలో ఏడీ  జనార్దన్ రావు, ఎంపీపీ రాజు నాయక్, జడ్పీటీసీ కవిత, ఎంపీడీవో శ్రీనివాస్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మల్లేశ్ యాదవ్, డాక్టర్ రాజు పాల్గొన్నారు.