హాస్టళ్లలో మెనూ సక్కగ పాటిస్తలే

హాస్టళ్లలో మెనూ సక్కగ పాటిస్తలే
  • వారానికి రెండు, మూడుసార్లే గుడ్డు
  • నీళ్ల కూరలు.. కోడి కాళ్లు, స్కిన్‌తో నాన్‌‌‌‌వెజ్‌‌‌‌ కర్రీ   
  • 2015 నుంచి మెస్ చార్జీలుపెంచని సర్కారు   
  • గిట్టుబాటైతలేదని నాణ్యత, పరిమాణం తగ్గిస్తున్న నిర్వాహకులు  
  • మెస్ చార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:   రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో మెనూ సక్కగా పాటించడంలేదు. స్టూడెంట్లకు పెడ్తున్న ఫుడ్ లో క్వాలిటీ, క్వాంటిటీ సరిగ్గా ఉండటంలేదు. పెరిగిన ధరలతో అంతంత మాత్రంగానే సరుకులు వస్తుండటంతో పూర్తిస్థాయిలో మెనూను పాటించడం లేదు. నీళ్ల కూరలు, అరకొర భోజనంతోనే నెట్టుకొస్తున్నరు. వారానికి మూడు సార్లు మాత్రమే గుడ్డు పెడుతున్నారు. కోడి తల, కాళ్లతో చికెన్‌‌‌‌ కర్రీ పెడుతున్నారు. తగినంత ఫుడ్‌‌‌‌ దొరక్కపోవడంతో స్టూడెంట్లు అర్ధాకలితో అలమటిస్తున్నారు. చాలామంది స్టూడెంట్లు పౌష్టికాహార లోపం బారిన పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే మెస్‌‌‌‌ చార్జీలు పెంచి, స్టూడెంట్లకు మంచి ఆహారం అందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌‌‌‌ చేస్తున్నాయి.  

రోజుకు 30 రూపాయలే 

రాష్ట్రవ్యాప్తంగా 669 ఎస్సీ, 419 బీసీ ప్రీమెట్రిక్‌‌‌‌ హాస్టళ్లు, 204 ఎస్సీ, 278 బీసీ పోస్ట్‌‌‌‌ మెట్రిక్‌‌‌‌ హాస్టళ్లు ఉన్నాయి. మరో 136 ఎస్టీ హాస్టళ్లు, 326 ఆశ్రమ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 2.6 లక్షల మంది స్టూడెంట్లు ఉన్నారు. అయితే తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో హాస్టళ్ల మెస్‌‌‌‌ చార్జీలు పెంచారు. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఒక రోజుకు రూ. 31, తొమ్మిది, పదో తరగతి స్టూడెంట్లకు 36, ప్రీమెట్రిక్‌‌‌‌ అయితే రూ. 50గా ఖరారు చేశారు. అయితే దేశంలో, రాష్ట్రంలో అన్ని రంగాల్లో ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ రేట్లు పెరగడంతో అన్నింటిపై ఎఫెక్ట్‌‌‌‌ పడింది. ముఖ్యంగా కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. కానీ 2015 తర్వాత మళ్లీ మెస్‌‌‌‌ చార్జీలు పెంచలేదు. అంటే దాదాపుగా ఏడేండ్లుగా పాత రేట్లతోనే హాస్టళ్లను నెట్టుకొస్తున్నారు. 

నీళ్ల కూరలు.. ఎగ్‌‌‌‌ ఎగవేత 

ధరలు పెరగడంతో హాస్టళ్లలో నిర్వాహకులు ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ తగ్గిస్తున్నారు. పది కిలోల పప్పు వండాల్సిన చోట 5 కిలోలతోనే సరిపెడుతున్నారు. దీంతో కూరలు నీళ్లచారు లెక్క చేస్తున్నారు. అన్ని రకాల కూరగాయలు కూడా ఇట్లనే వండుతున్నరు. మొదట్లో ప్రతిరోజు గుడ్డు, అరటి పండ్లు ఇచ్చేవారు. రానురాను వీటిని తగ్గిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం గుడ్లు వారానికి ఐదు ఇవ్వాల్సి ఉండగా, రెండు నుంచి మూడే పెడుతున్నారు. అరటి పండ్లు కూడా ఇట్లనే ఇస్తున్నారు. ఇక ఆదివారం కోడి కాళ్లు, తలకాయలతో చికెన్‌‌‌‌ వండుతున్నారు. మొత్తం సూప్‌‌‌‌ లెక్క చేసి వడ్డిస్తున్నారు. ఇటీవల సత్తుపల్లిలోని ఓ హాస్టల్‌‌‌‌లో ఈ విషయం బయటపడింది. అలాగే పెరుగుకు బదులు మజ్జిగ పోస్తున్నారు.

కాస్మోటిక్‌‌‌‌ చార్జీలూ పెంచలే 

హాస్టల్ స్టూడెంట్లకు కాస్మోటిక్‌‌‌‌ చార్జీలు కూడా పెంచడంలేదు. పన్నెండేండ్ల కిందటి చార్జీలనే ఇప్పటికీ చెల్లిస్తున్నారు. ప్రస్తుతం గర్ల్స్‌‌‌‌కు నెలకు రూ. 75, బాయ్స్‌‌‌‌కు రూ. 50 ఇస్తున్నారు. చార్జీలు పెంచాలని సర్కారుకు రెండు సార్లు సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ అతీగతీలేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చార్జీలే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. సర్కారు ఇచ్చే అరకొర చార్జీలతో సబ్బులు, ఆయిల్‌‌‌‌, టూత్‌‌‌‌పేస్ట్‌‌‌‌, షాంపూలు, కటింగ్‌‌‌‌కు సరిపోవడంలేదు. శానిటరీ నాప్కిన్స్‌‌‌‌ కొనలేక గర్ల్స్‌‌‌‌ వివిధ కారణాలు చెబుతూ క్లాస్‌‌‌‌లకు అటెండ్‌‌‌‌ కాలేకపోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి.

స్టూడెంట్లకు పోషకాహారలోపం

హాస్టళ్లలో నాసిరకం ఫుడ్‌‌‌‌తో స్టూడెంట్లు పోషకాహారలోపం బారిన పడుతున్నారు. బలమైన ఫుడ్‌‌‌‌ దొరక్క వయసుకు తగ్గట్లు బరువు, ఎత్తు పెరగడంలేదని నివేదికలు చెబుతున్నాయి. మరికొందరు ఎనీమియాతో బాధపడుతున్నారు. గతంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహించగా 20 %  మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేలింది. ఇప్పటికైనా ప్రభుత్వం మెస్‌‌‌‌ చార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌‌‌‌ చేస్తున్నాయి. 

మెస్‌‌‌‌ చార్జీలు పెంచాలె 

ఇటీవల కొన్ని హాస్టళ్లను విజిట్ చేస్తే.. ఎక్కడా క్వాలిటీ ఫుడ్‌‌‌‌ కనిపించలేదు. అదికూడా తగినంత పెట్టడంలేదు. ఏదో నామమాత్రంగా వడ్డిస్తుండటంతో స్టూడెంట్లు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే ఎగ్‌‌‌‌ పెడ్తున్నరు. పెరిగిన ధరలతో తమకు గిట్టుబాటు కావడంలేదని నిర్వాహకులు అంటున్నరు. స్టూడెంట్లకు ఎదిగే దశలో బలమైన ఫుడ్‌‌‌‌ అవసరం. అందుకే మెస్‌‌‌‌ చార్జీలను పెంచాలె. అలాగే కాస్మోటిక్‌‌‌‌ చార్జీలను కూడా పెంచాలె. 
- నాగరాజు, స్టేట్‌‌‌‌ సెక్రటరీ, ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ