
- ఆధార్ లింక్ లేని భూములు మిగులు ఖాతాలోకి!
- రైతులకు శాపంగా మారిన రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం
- కొత్త పాస్‌బుక్కులకు నోచుకోని 100 మంది రైతులు
- న్యాయం చేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
- ధరణి పోర్టల్‌లో ఆప్షన్ లేదని తిప్పి పంపుతున్నరు
సిద్దిపేట, వెలుగు : ధరణి పోర్టల్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పిదం కోహెడ మండలం బస్వాపూర్ రైతులకు శాపంగా మారింది. ఆధార్ లింక్ చేయలేదనే సాకుతో గ్రామంలోని100 మంది రైతులకు సంబంధించిన 150 ఎకరాలను మిగులు భూముల ఖాతా వేశారు. దీంతో రైతులకు కొత్త పట్టాపాసు బుక్కులు రావడం లేదు. ఫలితంగా రైతుబంధు, రైతు బీమాకు అనర్హులు కావడమే కాదు పండించిన వడ్లు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆడబిడ్డల పెళ్లిళ్లకో, కుటుంబ అవసరాలకో కొంత అమ్ముకుందామన్నా అధికారులు పాస్‌బుక్కులు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
దరఖాస్తులతో ఆర్థిక భారం
మిగులు భూముల ఖాతాలో పడ్డ తమ భూమిని తమ ఖాతాలోకి మార్చుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఆర్థిక భారాన్ని మిగులుస్తున్నాయి. బాధిత రైతులు ఇప్పటికీ నాలుగైదు సార్లు రూ. 2 చొప్పుల చెల్లించి ధరణిలో పోర్టల్ దరఖాస్తు పెట్టుకుంటున్నారు. కానీ, ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వలేదని అధికారులు రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో న్యాయం చేయాలని అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నే ఉన్నారు.
ధరణిలో ఆప్షన్ లేదు
మిగులు భూములకు సంబంధించిన ధరణిలో ఎలాంటి అప్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. మీసేవ, టీసేవ సెంటర్ల నిర్వాహకులను మాత్రం సర్వే నెంబర్ మిస్సింగ్, టీఎం 33 మ్యాడ్సూల్, జీఎల్‌ఎం(గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్) లాంటి ఆప్షన్స్‌లో అప్లై చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు ఒక్కటి కూడా అప్రూవ్ కాలేదు. ధరణి అప్లికేషన్లు త్వరగా క్లియర్ చేయాలని ప్రభుత్వం ఒత్తడి చేస్తుండడంతో చేసేది లేదని రిజెక్ట్ చేస్తున్నారు.
ఆఫీసుల చుట్టు తిరుగుతున్న
మా తాత ముత్తాతల నుంచి వస్తున్న 34 గుంటలు మిగులు భూమి ఖాతాలో పడింది. దీన్ని సవరించాలని మూడేండ్లుగా ఆఫీసుల చుట్టు తిరుగుతున్నా అధికారులు పట్టించుకుంటలేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా రిజెక్ట్ చేస్తున్నరు. కొత్త పాస్‌బుక్కులు లేక రైతుబంధు పైసలు వస్తలేవు. పక్క రైతుల పేరిట వడ్లు అమ్ముకోవాల్సి వస్తుంది.
–బండి పేరయ్య, బస్వాపూర్
ధరణిలో అప్షన్ వస్తేనే సవరణ
ధరణిలో సవరణ అప్షన్ లేకపోవడంతో ఇబ్బంది ఏర్పడింది. ఎల్ ఆర్‌యూపీ(ల్యాండ్ రికార్డ్ ఆప్డేట్ ప్రొగ్రాం) సమయంలో రైతులు అందుబాటులో లేకపోవడం, ఆధార్ అనుసంధానం చేయకపోవడం , కొన్ని సాదాబైనామా కేసుల వల్ల ఆ భూములను మిగులు ఖాతాలో వేశాం. సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
- రాజిరెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్, కోహెడ
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు బండి రాజు. కోహెడ మండలం బస్వాపూద్‌కు చెందిన ఇతనికి మూడెకరాల భూమి ఉంది. మూడేండ్ల కింద అందుబాటులో లేక పాస్‌బుక్కుకు ఆధార్ లింక్ చేయలేదు. దీంతో అతని భూమిని రెవెన్యూ సిబ్బంది మిగులు భూముల ఖాతాలో వేయడంతో కొత్త పాస్ బుక్కు రాలేదు. సమస్య పరిష్కరించాలని రూ. 2 వేల చొప్పున మూడు సార్లు చెల్లించి ధరణిలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఆప్షన్ లేదనే కారణంతో అధికారులు రిజెక్ట్ చేస్తున్నారు.