పంచాయతీల సొమ్ము సర్కారు ఖజానాకు

V6 Velugu Posted on Jul 27, 2021

  • ఆదాయం లేక ఆగిపోతున్న అభివృద్ధి పనులు
  • పల్లెల సొంత ఆదాయ మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపుల్లలు
  • సీనరేజీ డబ్బు పంచాయతీలకు ఇయ్యట్లే
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ట్రాన్స్​ఫర్​ డ్యూటీ కట్
  • కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ నిధులపైనా పెత్తనం
  • ఏడేండ్లలో రూ. 7,500 కోట్ల ఉపాధి నిధులు సర్కారు అకౌంట్లకే

ములుగు పంచాయతీ పరిధిలో 2019 నుంచి రూ. 20 కోట్లకు పైగా భూముల క్రయ విక్రయాలు జరిగాయి. దీని ద్వారా రిజిస్ట్రేషన్‌‌ శాఖకు రూ. 1.80 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో రిజిస్ట్రేషన్ ​శాఖకు వచ్చిన ఆదాయంలోంచి ‘ట్రాన్స్​ఫర్​ డ్యూటీ’ కింద పంచాయతీలకు 1.5 శాతం చెల్లించేవారు. ఈ పైసల కోసం ములుగు పంచాయతీ పాలకవర్గం ఎదురుచూస్తుండగా.. ఈ నెల 20న ‘ట్రాన్స్​ఫర్ ​డ్యూటీ’ని  ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో  ఈ గ్రామానికి రావాల్సిన రూ. 2.70 లక్షల ఆదాయం సర్కారు తన వద్దే ఉంచుకుంది.

వరంగల్‌‌ రూరల్‌‌ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్‌‌లో రెండు క్రషర్‌‌ మెషీన్లు, రెండు కంకర క్వారీలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా పన్నులు వసూలు చేసుకున్న రాష్ట్ర సర్కారు.. పంచాయతీకి మాత్రం వాటా చెల్లించలేదు. గడిచిన నాలుగేండ్లకు కలిపి గ్రామానికి రూ. 5 లక్షల సీనరేజీ నిధులు రావాల్సి ఉంది. అవి వస్తే గ్రామంలో సీసీ రోడ్లు, ఇతరత్రా పనులు చేపట్టాలని పాలకవర్గం భావించింది. కానీ రాకపోవడంతో ఆర్థిక సంఘం నిధుల కోసం నెలనెలా ఎదురుచూడాల్సి వస్తోంది. 

నెట్​వర్క్​, వెలుగు: గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయ మార్గాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా మూసేస్తోంది. ఊర్ల పైసలను గుంజుకుంటోంది. ప్రతి అవసరానికీ తనపై ఆధారపడేలా చేస్తోంది. ఊర్లలోని గ్రానైట్, ఇసుక క్వారీలు, క్రషర్ల ద్వారా పంచాయతీలకు వచ్చే  25 శాతం సీనరేజీ నిధులను ఆపేసింది. తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు వచ్చే ‘ట్రాన్స్​ఫర్​డ్యూటీ’ని కూడా ఎత్తివేస్తూ ఈ నెల 20న జీవో నంబర్​60 జారీ చేసింది. ఇక పంచాయతీలకు మాత్రమే దక్కాల్సిన ఉపాధి హామీ నిధులపైనా రాష్ట్ర సర్కారు పెత్తనం చెలాయిస్తోంది. గడిచిన ఏడేండ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. 15,738 కోట్ల ఉపాధి నిధులు రాగా.. ఇందులో మెటీరియల్​ వర్క్​కు  సంబంధించి సుమారు రూ. 6 వేల కోట్లను పంచాయతీలకు ఇవ్వకుండా తన ఖాతాలోకి మలుపుకుంది. వాటిని ఇష్టమైన చోట, ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెడుతోంది. తన వాటాగా ఈజీఎస్​ కింద ఇవ్వాల్సిన సుమారు రూ. 1,500 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. ఇట్ల ఈజీఎస్​కు సంబంధించినవే రూ. 7,500 కోట్ల దాకా రాష్ట్ర సర్కారు తన ఖాతాలోకి మళ్లించుకుంది. పంచాయతీల్లో నిధులు లేక చిన్నచిన్న పనులు కూడా సర్పంచులు చేయించలేకపోతున్నారు.

రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలున్నాయి.  ఒక్కో ఊరి అవసరాలు, సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి. అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకొని అమలుచేసే అధికారాన్ని గ్రామ సర్పంచ్​, పాలకవర్గానికి రాజ్యాంగం కల్పించింది. ఈ మేరకు గ్రామాలకు ప్రత్యేక ఆదాయ మార్గాలు, సర్పంచులకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.  ఊర్లలో సమస్యలను గుర్తించడం, గవర్నింగ్​బాడీ, గ్రామసభలో చర్చించడం, విలేజ్​అసెంబ్లీ  తీర్మానాల మేరకు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టి  అభివృద్ధి పనులు చేయించడం సర్పంచుల మెయిన్​ డ్యూటీగా గతంలో ఉండేది. కానీ టీఆర్​ఎస్​ ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌యాక్ట్‌‌‌‌‌‌‌‌‒2018 తర్వాత గ్రామాల్లో  రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం పెరుగుతోంది. గ్రామ అవసరాలను బట్టి అభివృద్ధి చేసుకునే వెసులుబాటు, గ్రామ సభల్లో చర్చించి తీసుకునే నిర్ణయాలకు విలువ లేకుండా పోతోంది. పంచాయతీలకు ఏం కావాలో ప్రగతి భవన్​లో కూర్చొని సీఎం కేసీఆర్ గానీ, కేబినెట్​గానీ​నిర్ణయిస్తే సర్పంచులు అమలుచేయాల్సి వస్తోంది. సర్పంచులు దొరికినకాడల్లా అప్పులు చేసి శ్మశానవాటికలు, రైతువేదికలు, విలేజ్​పార్కులు, డంపింగ్​యార్డులు కట్టిస్తున్నారు. సర్కారు చెప్పిందని స్థోమత లేకున్నా ట్రాక్టర్లు, ట్యాంకర్లు కొంటున్నారు. తిరిగి అప్పులు తీర్చేందుకు సర్కారు ఇచ్చే  పైసల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.  

ఈజీఎస్ ఫండ్స్  మళ్లింపు
కేంద్ర ప్రభుత్వం‌‌‌‌ గ్రామాలకు నేరుగా ఇచ్చే ఈజీఎస్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ పై  వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి  ఎలాంటి అధికారం లేదు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు చేసిన మట్టి పనుల ప్రకారం పంచాయతీలకు మెటీరియల్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన లేబర్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా 60:40 రేషియోలో ఫండ్స్​ రిలీజ్​చేయాలి. లక్ష్యానికి తగ్గట్టుగా లేబర్​తో కష్టపడి పనులు చేయించుకున్న పంచాయతీలకు మెటీరియల్​ వర్క్​  కింద 40 శాతం నిధులను నేరుగా ఖర్చు చేసుకునే అవకాశం ఉండేది. కానీ..ఈ 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకుంది. తమ ఊరికి వచ్చిన నిధులపై గ్రామ సభలు పెట్టుకొని పనులు గుర్తించడంతోపాటు, అవసరమైన సీసీ రోడ్లు, పొలాలకు మట్టిరోడ్లు, మెటల్‌‌‌‌‌‌‌‌ రోడ్లు,  చెరువులకు తూములు, మత్తళ్లు, పంట కాల్వల రిపేర్లు, ఇతరత్రా చిన్న, చిన్న సిమెంట్‌‌‌‌‌‌‌‌ వర్కులు చేసుకునే అధికారాన్ని కూడా పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం గుంజుకున్నది. గడిచిన ఏడేండ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.15,738 కోట్ల ఉపాధి నిధులు రాగా, ఇందులో మెటీరియల్​వర్క్​ కు సంబంధించి సుమారు రూ. 6 వేల కోట్లను గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. కానీ వాటిని స్టేట్​గవర్నమెంట్​ తన ఖాతాకు మళ్లించుకొని తనకు ఇష్టమొచ్చిన చోట, ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడుతోంది. తన వాటాగా ఈజీఎస్​ కింద పంచాయతీలకు ఇవ్వాల్సిన  సుమారు రూ. 1500 కోట్లను కూడా తన దగ్గరే పెట్టుకున్నది. 

పంచాయతీల్లో ఫండ్స్​ లేక తిప్పలు
రాష్ట్ర సర్కారు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడల్లా లక్షలకు లక్షలు బయట అప్పులు తేవాల్సి వస్తోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో ఫండ్స్​ లేకపోవడం వల్ల గ్రామస్తులు అడిగే చిన్నచిన్న పనులు కూడా చేయించలేక తలదించుకోవాల్సి వస్తోందంటున్నారు. చాలా గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి రూ. 5 లక్షలు పెట్టి కొత్త ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌, రూ.1.88 లక్షలు పెట్టి ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీ, రూ.1.83 లక్షలు పెట్టి ట్యాంకర్‌‌‌‌ ‌‌‌‌కొనుగోలు చేశారు. ఇప్పుడీ ట్రాక్టర్లు ఆయా గ్రామపంచాయతీలకు గుదిబండగా మారాయి. ట్రాక్టర్‌‌‌‌ ‌‌‌‌నడిపే డ్రైవర్‌‌‌‌‌‌‌‌ జీతం, రోజూ డీజిల్‌‌‌‌ ‌‌‌‌ఖర్చులు ఎల్లక, కొందరు సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు వాటిని పక్కన పడేశారు. అలాగే సర్కారు గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలను రూ. 8,500కు పెంచినా కొత్తగా చిల్లి గవ్వా కూడా తన ఖజానా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. వీళ్ల జీతాలు కూడా గ్రామ పంచాయతీలే ఇవ్వాలని ఆదేశించడంతో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్థిక సంఘం నిధులే దిక్కు
ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులే దిక్కవుతున్నాయి. జనాభా ఆధారంగా ఏడాదికి ఒక్కో మనిషికి రూ. 1,600 చొప్పున ఈ ఫండ్స్​ వస్తున్నాయి. ఈ లెక్కన 500 జనాభా ఉండే గ్రామ పంచాయతీకి ఏడాదికి రూ. 8 లక్షలు రావాలి. ప్రతి నెలా అన్ని గ్రామ పంచాయతీలకు కలిపి రూ. 339 కోట్లు రిలీజ్​చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు చెప్తున్నా.. రెగ్యులర్‍ గా రావట్లేదు. ఒకవేళ వచ్చినా శానిటేషన్‍ , కరెంట్‍ బిల్లులు, ట్రాక్టర్ల ఈఎంఐలు,  సిబ్బంది శాలరీలకే సరిపోతున్నాయి. దీంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పొలాలకు, శ్మశానాలకు మట్టిరోడ్ల నిర్మాణం, పైపులైన్ల లీకేజీలు, బోర్​వెల్స్​, ట్యాంకుల క్లీనింగ్​, రిపేర్లు... ఇలాంటి పనులన్నీ పెండింగ్​పడుతున్నాయి. 

ఇట్లయితే మోరీలు కూడా సాఫ్ చేసుకోలేం
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే కనీసం మురుగు కాల్వలు కూడా శుభ్రం చేయలేం. ‌‌పంచాయతీలకు ఆదాయం వచ్చే అన్ని దారులను క్లోజ్​ చేసింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ​శాఖ నుంచి వచ్చే ట్రాన్స్​ఫర్​ డ్యూటీని కూడా కట్​ చేసింది.  కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులే దిక్కైతున్నయ్​. వాటితోనే చిన్నచిన్న పనులు చేసుకుంటున్నం. 
- కర్లపుడి సుభద్ర, మద్దులపల్లి సర్పంచ్, ఖమ్మం జిల్లా

సీనరేజి ఫండ్స్​ వస్తలేవ్
మా గ్రామానికి గతంలో గ్రానైట్​క్వారీ నుంచి రావాల్సిన రూ. 53 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ తీసుకుంది. నేను సర్పంచ్​గా గెలిచినప్పటి నుంచి సీనరేజి ఫండ్స్​ గ్రామ పంచాయతీ ఖాతాలో జమైతలేవ్​.  ఆఫీసర్లు స్పందిస్తలేరు. ఈ ఫండ్స్ రాకపోవడం వల్ల ఊర్లో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నం.  
- కంకణాల విజయేందర్ రెడ్డి, గట్టుభూత్కురు సర్పంచి, కరీంనగర్ జిల్లా

నిధులు ఇస్తలేరు.. 
మా గ్రామంలో రెండు కంకర క్వారీలు, రెండు క్రషర్‌‌‌‌‌‌‌‌  మిషన్లు ఉన్నాయి. వీళ్లు ఏటా రూ. కోట్లలో బిజినెస్​ చేస్తారు. మైనింగ్‌‌‌‌‌‌‌‌ శాఖకు లక్షల్లో పన్నులు కడుతున్నారు. మైనింగ్‌‌‌‌‌‌‌‌ శాఖ ద్వారా లోకల్​బాడీస్​కు 25 శాతం వాటా రావాలి. కానీ నేను సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇవ్వలేదు. అడిగితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని చెప్తున్నారు.  ఆ పైసలే ఉంటే ప్రతిదానికి ప్రభుత్వం దిక్కు చూసేవాళ్లం కాదు.
‒ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, గోవిందాపూర్‌‌‌‌‌‌‌‌ సర్పంచ్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ జిల్లా

Tagged Telangana, government treasury, Panchayathi funds, EGS funds

Latest Videos

Subscribe Now

More News