
VI News: ప్రముఖ ప్రైవేట్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా తాజాగా 2G హ్యాండ్‌సెట్ వినియోగదారుల కోసం కొత్తగా వీ గ్యారెంటీ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద రూ.199 పైన రీచార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కింద 2 రోజుల అదనపు గడువును అందించనుంది. అంటే ప్రతి నెల రెండు రోజుల చొప్పున ఏడాదిలో 12 నెలల కాలానికి వినియోగదారులు చేసుకునే రీచార్జ్ కి 24 రోజులు అదనపు వ్యాలిడిటీని పొందుతారు.
కేవలం వాయిస్- కాల్స్ మాత్రమే వినియోగిస్తూ తక్కువ డేటా వినియోగించే ప్రీపెయిడ్ కస్టమర్‌లు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యను వీ గ్యారెంటీ కార్యక్రమం పరిష్కరించే లక్ష్యంతో రూపొందించబడింది. ప్రస్తుతం టెలికాం సంస్థలు పాటిస్తున్న 28 రోజుల వ్యాలిడిటీ విధానం కింద ఒకే నెలలో రెండు సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. అందుకే వొడఫోన్ ఐడియా ఈ గడువును 30 రోజులకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. 28 రోజుల కంటే ఎక్కువ కాలానికి చేసుకునే రీచార్జ్ ప్లాన్లలో కూడా రెండు రోజుల అదనపు కాలాన్ని కంపెనీ చేర్చింది.
వీ గ్యారెంటీ ఆఫర్ కింద రూ.199 ప్యాక్‌లో అపరిమిత కాల్స్, 2GB డేటా 300 SMS లభిస్తాయి. అయితే, అస్సాం, నార్త్ ఈస్ట్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, రాజస్థాన్ సర్కిళ్లలోని కస్టమర్లకు ఇదే ప్యాక్‌పై 3GB డేటా అందుతుంది. ఈ ప్యాక్ సాధారణ గడువు 28 రోజులు కాగా.. ప్రస్తుతం వీ గ్యారెంటీ కింద అదనంగా 2 రోజులు అంటే మెుత్తం వ్యాలిడిటీ 30 రోజులకు పెరుగుతుంది.
అలాగే కస్టమర్లు రూ.209 ప్యాక్ కింద అపరిమిత కాల్స్, 2GB డేటా, 300 SMS కాలర్ ట్యూన్స్ ప్రయోజనాలు ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రత్యేక సర్కిళ్లకు చెందిన కస్టమర్లకు ఈ ప్యాక్‌లో కూడా 3GB డేటా కాలర్ ట్యూన్స్ అందుతాయి. ఈ ప్యాక్ సైతం 28 రోజుల సాధారణ గడువుకు అదనంగా 2 రోజుల వ్యాలిడిటీతో మెుత్తం 30 రోజులు మెుబైల్ సేవలను అందిస్తుంది.