
హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం అనుమతుల తిరస్కరణ తాత్కలికమేనని.. పునఃపరిశీలన తర్వాతైనా బనకచర్ల ప్రాజెక్ట్ మళ్లీ తెరమీదకు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై మంగళవారం (జూలై 1) ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంబంధిత అధికారులు ఈ పీపీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కార్ మనుగడ చంద్రబాబు మీద ఆధారపడి ఉందని.. చంద్రబాబు మనుగడ గోదావరి జలాల మీద ఆధారపడి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
11 ఏళ్లుగా తెలంగాణను కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యంగా చేస్తోందని.. రాష్ట్రానికి అన్యాయం చేస్తోన్న బీజేపీపై పోరాటం ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చచ్చిన బీఆర్ఎస్ను బతికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్ర హక్కులను కాలరాసేందుకే బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చామా అని ప్రశ్నించారు. ఏపీ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు వాళ్ల రాష్ట్ర కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు మాత్రం రాష్ట్రం కోసం ఎలాంటి ప్రయత్నం చేయట్లేదని విమర్శించారు.
తెలంగాణ నీటి కేటాయింపు గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కిషన్ రెడ్డి ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీశారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారని, ఆయన మాట్లాడే ప్రతిమాట కేసీఆర్ దగ్గరి నుంచే వస్తుందని ఆరోపించారు. నీటి పంపకాల గురించి చర్చించేందుకు మేం వస్తున్నామంటే ఆయన ముందే వెళ్లి కేంద్ర మంత్రిని కలుస్తున్నారు.. కిషన్ రెడ్డి తీరు అనుమానాలకు తావు ఇస్తోందన్నారు.
కేంద్రమంత్రులను కలిసేందుకు కిషన్ రెడ్డి మాతో కలిసి ఎందుకు రావడం లేదు.. మాకంటే ముందే వెళ్లి రహస్యంగా వెళ్లి చర్చించాల్సిన అవసరమేంటి అని ప్రశ్నించారు. గోదావరి వరద జలాలను తరలిస్తే తెలంగాణకు ఇబ్బందేంటని ఏపీ వాదిస్తోంది. మరీ నికర జలాల్లో మా వాటాపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెప్తోందని నిలదీశారు. మూడో పంట కోసం ఏపీ ప్రయత్నిస్తోందని.. ఇక్కడ మాకు మొదటి పంటకే నీళ్లు లేవని అన్నారు.
ALSO READ | మాకు రాగి సంకటి, చేపల పులుసు వద్దు.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి
మా నీటి వాటాలపై ఏపీ కూడా సహకరించాలని కోరారు. కేసీఆర్ హయాంలో జరిగిన చర్చల మేరకే చంద్రబాబు ప్రాజెక్ట్ కడుతున్నారన్నారు. నికర జలాల్లో 968 టీఎంసీలు, ప్రాజెక్టులకు అనుమతుల కోసమే మా ప్రయత్నమని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నికర జలాలు, మిగులు, వరద జలాల లెక్కలు తేల్చాలని కేంద్రాన్ని కోరతున్నాం.. అన్ని లెక్కలు తేలాకే వరద జలాల గురించి మాట్లాడాలని ఖరాకండింగా చెప్పారు.రొయ్యల పులుసు, రాగి సంకటితో మాకు పని లేదని.. నీళ్ల ప్రయోజనాలే మాకు ముఖ్యమని తేల్చి చెప్పారు.