
సర్కారుకు వ్యవసాయశాఖ నివేదిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం సాగు, కోటి 28 లక్షల 20 వేల 698 ఎకరాలకు చేరింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ ఏడాది ఇప్పటివరకు సాధారణ సాగులో 104 శాతం మేర అన్ని రకాల పంటలు సాగైనట్లు నివేదికలో వెల్లడించారు. అందులో10,59,974 ఎకరాల సాగుతో నల్గొండ జిల్లా టాప్లో నిలిచింది. 7.75 లక్షల ఎకరాల సాగుతో సంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉంది. 5.87 లక్షల ఎకరాలతో వికారాబాద్.. ఆదిలాబాద్ 5.61 లక్షల ఎకరాలు.. సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో 5.55 లక్షల ఎకరాలు.. కామారెడ్డి 5.12 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 58,28,686 ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు.
సర్కారు 45 లక్షల ఎకరాల్లో వరి సాగు టార్గెట్ పెట్టగా.. 13.28 లక్షల ఎకరాల్లో ఎక్కువ వరి నాట్లు వేశారు. దీంతో ఈయేడు వానాకాలంలో అన్ని పంటల కంటే అత్యధికంగా వరి సాగు జరినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరి తర్వాత 48,95,905 ఎకరాల్లో పత్తి సాగైంది. 70 లక్షల ఎకరాల్లో కాటన్ సాగు చేయాలని సర్కారు టార్గెట్ పెట్టగా, వర్షాల పలు చోట్ల పంట దెబ్బతిన్నది. మక్కలు 6.59 లక్షల ఎకరాల్లో, కంది 5.5 లక్షల ఎకరాలు, చిరు, తృణ ధాన్యాలు 3,492 ఎకరాల్లోనే సాగైనట్లు వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొంది.