
జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో అత్యంత అవినీతి పాలన నడుస్తోందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన.. సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా డిమాండ్ చేస్తున్న కేసీఆర్ ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి డీపీఆర్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. నీటి కేటాయింపులు లేకుండా జాతీయ హోదా ఎలా ఇస్తారని అన్నారు.
కేసీఆర్ ఇచ్చి మరిచిపోయిన హామీలను గుర్తు చేసేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని ప్రహ్లాద్ సింగ్ స్పష్టం చేశారు. ఆర్డీఎస్ విషయంలో కేసీఆర్ సర్కారు ఇచ్చిన హామీ ఏమైందన్న ఆయన.. సమస్య పరిష్కారానికి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరందరిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజెక్టులపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్యలు, దాడులకు పాల్పడటం సమంజసం కాదని ప్రహ్లాద్ సింగ్ హితవు పలికారు.