ఈ బియ్యం ధర కిలో రూ.12 వేలు.. స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

ఈ బియ్యం ధర కిలో రూ.12 వేలు.. స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

దక్షిణాసియాలో దాదాపు అన్ని దేశాల్లో అన్నమే ప్రధాన ఆహారం. అందుకు ప్రధాన కారణం బియ్యం అన్ని కాలాల్లో అందుబాటులో ఉండడమే. పైగా వాటి ధర తక్కువ. కానీ.. జపాన్‌‌‌‌లో మాత్రమే పండే ఈ బియ్యం ధర మాత్రం చాలా ఎక్కువ. మన దగ్గర ప్రీమియం క్వాలిటీ బియ్యం ధర కూడా కిలోకు రూ. 100కి మించి ఉండదు. జపనీస్ కంపెనీ టోయో రైస్ కార్పొరేషన్ ‘కిన్మెమై’ బ్రాండ్‌‌‌‌ పేరుతో అమ్మే ఈ బియ్యం ధర రూ. 12,000 పైమాటే. అత్యాధునిక రైస్‌‌‌‌–బఫింగ్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని ఉత్పత్తి చేశారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.

కడగాల్సిన పనిలేదు

సాధారణంగా అన్నం వండే ముందు బియ్యాన్ని ఒకట్రెండు సార్లు కడుగుతారు. ఆ తర్వాత కాసేపు నానబెట్టి వండుతారు. కిన్మెమై ప్రీమియం రైస్‌‌‌‌ని మిల్లింగ్ చేసేటప్పుడే కడుగుతారు. అందులో స్టార్చ్, పిండి లాంటివి ఉండవు. అందువల్ల ఈ బియ్యాన్ని కడగకుండానే వండుకోవచ్చు. ఈ రైస్‌‌‌‌లో పోషక విలువలు కూడా చాలా ఎక్కువ. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ బియ్యాన్ని ప్రధానంగా జపాన్‌‌‌‌లోని కోషిహికారి ప్రాంతంలో పండిస్తారు. ఈ ప్రాంతం ఎత్తైన పర్వతాల మధ్య ఉంటుంది. అందువల్ల రైస్‌‌‌‌ పండేందుకు అనువైన టెంపరేచర్లు ఉంటాయి. అక్కడి ఎచిగో–కొమగటకే పర్వతం నుంచి వచ్చే జలధారల్లో మినరల్స్‌‌‌‌ సమృద్ధిగా ఉంటాయి. ఆ నీటినే ఈ బియ్యం సాగుకు వాడతారు. ఇవి సాధారణ బియ్యం కంటే సైజులో కాస్త పెద్దగా ఉంటాయి. 

ఎందుకు ఖరీదైనవి?

టోయో రైస్ కార్పొరేషన్ ‘కిన్మెమై’ బ్రాండ్ కోసం పికామారు, కోషిహికారి అనే ప్రపంచంలోనే అత్యుత్తమమైన రైస్ వెరైటీలను వాడుతోంది. కంపెనీవాళ్లు వీటిని మామూలు బియ్యం కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ ధరకు రైతుల నుంచి కొంటారు. తరువాత ఏజింగ్ ప్రాసెస్‌‌‌‌తో వాటి ఆకృతి, రుచిని మెరుగుపరుస్తారు. 

బఫింగ్ ప్రక్రియ ద్వారా పొట్టు చుట్టూ ఉన్న మైనపు పొరను తొలగిస్తారు. 2016లో మొట్టమొదటిసారి ఈ బియ్యాన్ని మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చారు. మొదట్లో 840 గ్రాముల ప్యాక్‌‌‌‌ని 9,496 జపనీస్ యెన్‌‌‌‌లకు (సుమారు రూ. 5,490) అమ్మారు. సాధారణ బియ్యం ధర అక్కడ కిలోకు 300 నుంచి 400 యెన్‌‌‌‌ల (రూ. 173– రూ. 231) మధ్య  ఉంటుంది. అయితే.. కిన్మెమై ప్రీమియం రైస్‌‌‌‌ ప్రస్తుత ధర 840 గ్రాములకు రూ. 10,548. అంటే కిలోకు దాదాపు రూ. 12,557గా ఉంది.