జాతీయ జెండా వెనక ఎంతో చరిత్ర ఉంది

జాతీయ జెండా వెనక ఎంతో చరిత్ర ఉంది

మన జాతీయ జెండా వెనక ఎంతో చరిత్ర ఉంది. ‘1857‌‌‌‌–సిపాయిల తిరుగుబాటు’ తర్వాత దేశమంతటికీ ఒకే జెండా ఉండాలని అప్పటి బ్రిటిష్​ పాలకులు అనుకున్నారు. అందులో భాగంగా తయారుచేసిందే బ్రిటిష్​ వలస కాలనీ జెండా. దీన్నే ‘బ్రిటిష్​ ఇండియా జెండా’ అని కూడా అంటారు. ఆంగ్లేయుల పాలనలో ఉన్న మిగిలిన దేశాల్లోని జెండా మాదిరిగానే ఇదీ ఉండేది. ఎరుపు రంగులోని ఈ పతాకంలో ఎడమ వైపు బ్రిటిష్​ ‘యూనియన్​ జాక్’ సింబల్​ ఉండేది. పతాకం కుడివైపు మధ్యలో స్టార్​ గుర్తు చుట్టూ బ్రిటిష్​ క్రౌన్​ చిహ్నం ఉండేది.1904లో చేసిన మరో పతాకంలో చుట్టూ ఎరుపు రంగు బార్డర్​ ఉండేది. అయితే, ఈ జెండాను బ్రిటిష్​ ప్రభుత్వం ఓకే చేయలేదు. 

వందేమాతరం ఉద్యమం అప్పుడు ఒక పతాకాన్ని 1906 ఆగస్టు​ 7న స్వాతంత్య్ర సమరయోధుడు శచీంద్ర ప్రసాద్​ తయారుచేశారు. దీన్ని ‘వందేమాతరం జెండా’, ‘కలకత్తా ఫ్లాగ్​’ అని పిలిచేవాళ్లు.  ఈ జెండా మూడు సమభాగాలుగా ఉంటుంది. పైభాగం ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. ఇందులో ఎనిమిది తామరపూలు ఉంటాయి. మధ్యలో పసుపు రంగు ఉంటుంది. ఇందులో హిందీలో రాసిన ‘వందేమాతరం’ కనిపిస్తుంది. కింది భాగంలో అటు ఇటు సూర్యచంద్రుల బొమ్మలు ఉంటాయి.  ‘కలకత్తా ఫ్లాగ్​’లో కొన్ని మార్పులు చేసి1907, ఆగస్టు​22న జర్మనీలో మేడమ్​ భికాజీ కామా ప్రదర్శించారు. ఇందులో కమలాలకు బదులు ఏడు నక్షత్రాలు పెట్టారు.1917లో హోంరూల్​ ఉద్యమం  టైంలో అనీబిసెంట్​, లోకమాన్య తిలక్​ కలిసి ఒక జెండా తయారుచేశారు. ఈ జెండాలో అడ్డంగా ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చ గీతలు ఉన్నాయి. జెండా పైభాగంలో ఎడమ పక్కన బ్రిటిష్​ ‘యూనియన్​ జాక్​’ ఉంటుంది. దానికి కిందిభాగంలో పై నుంచి కిందకు ఏడు నక్షత్రాలు ఉంటాయి. అలాగే జెండాకు కుడివైపు సూర్య, చంద్రుల బొమ్మలు ఉంటాయి. 

 1921లో జరిగిన కాంగ్రెస్​ సమావేశంలో ఒక జెండాను గాంధీజీ ప్రదర్శించారు. దీన్ని తయారుచేసింది మన తెలుగువాడైన పింగళి వెంకయ్య.ఈ జెండా కూడా మూడు సమభాగాలుగా ఉంటుంది. పైభాగంలో తెలుపు, మధ్యలో ఆకుపచ్చ, కింద ఎరుపు రంగు ఉంటాయి. మూడు భాగాలను కలుపుతూ రాట్నం ఉంటుంది.  1931లో జాతీయ పతాకంలో కొన్ని మార్పులు చేశారు. ఇందులో ఎరుపు బదులు కాషాయం వాడారు. దీన్ని పై భాగంలో ఉంచారు. అలాగే తెలుపును మధ్యలోకి, ఆకుపచ్చను కింది భాగంలోకి చేర్చారు. మూడు రంగులను కలుపుతూ ఉన్న రాట్నాన్ని ఈ జెండాలో కేవలం మధ్యలోని తెలుపు భాగంలో మాత్రమే ఉంచారు. అలాగే రాట్నం డిజైన్​ కూడా మార్చారు. 

ఇప్పుడు మనం ఎగరేస్తున్న జాతీయ జెండాకు 1947 జులై 22న స్వతంత్ర భారతావని కోసం రాజ్యాంగ సభ ఆమోదించింది. ఇందులో అంతకుముందటి జెండాలోని రంగులు, వాటి స్థానాలు అట్లనే ఉంచారు. మధ్యలో మాత్రం రాట్నానికి బదులు అశోక చక్రం పెట్టారు.