
1947, ఆగస్ట్ 15న భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలన ముగిసింది. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోతూ బ్రిటిష్ ఇండియా పాలనలో ఉన్న భూభాగాన్ని పాలించే అధికారాన్ని భారతీయులకే అప్పగించారు. సంస్థానాల భవిష్యత్‌ను వాటి ఇష్టానికే వదిలేశారు. అయిదు వందలకు పైగా సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనమయ్యాయి. హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ సంస్థానాలు మాత్రం స్వతంత్రంగానే ఉండాలనుకున్నాయి. హైదరాబాద్‌ని ఇండియాలో ఎలా కలుపుకోవాలనే విషయం మీద భారత ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది.
ALSO READ : తెలంగాణ సెప్టెంబర్ 17 హిస్టరీ: ఆ 5 రోజుల్లో ఏం జరిగింది.. ఇండియాలో హైదరాబాద్ విలీనం ఎలా అయ్యింది..?
నిజాంని లొంగదీసుకోవాలా..? లేక నిజాం రాజ్యాన్ని ఆక్రమించుకోవాలా..? అని తేలడానికి కొంత సమయం పట్టింది. ఈ క్రమంలో భారత పత్రికల్లో హైదరాబాద్ దక్కన్లో రజాకార్లు, కమ్యూనిస్టులు ఆరాచకాలు చేస్తున్నట్లుగా వార్తలు రావడంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానంపై ఇండియన్ ఆర్మీ సైనిక చర్య ప్రారంభించింది.
అయితే.. దప్పికైనప్పుడు చెరువు తవ్వుకున్నట్టు ఇండియన్ యూనియన్ నుంచి యుద్ధం ముంచుకొస్తుంటే నిజాం ప్రభుత్వం అప్పుడు సైన్యానికి కావాల్సిన ఆయుధాల గురించి ఆలోచించింది. ఇండియన్ యూనియన్ సైన్యాలకు తీవ్రమైన ప్రతిఘటన లేకుండానే నిజాం సైన్యం చేతులెత్తేసింది. ఆయుధ సంపత్తి, సంఖ్యాబలంలో పెద్దదైన ఇండియన్ యూనియన్ ఆర్మీని ఎదురించాలంటే తగినన్ని ఆయుధాలు లేవని నిజాం సైన్యం ప్రభుత్వానికి చెప్పింది.
ప్రభుత్వం పాకిస్థాన్ నుంచి ఆయుధాలు కొనాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయం ఇండియన్ యూనియన్‌కు తెలిసింది. గవర్నర్ జనరల్‌తో చేసుకున్న ఒప్పందానికి ఈ ఆయుధ కొనుగోలు నిరుద్ధమని మౌంట్ బాటన్ నిజాంని హెచ్చరించిండు. అలా పాకిస్తాన్ నుంచి ఆయుధ కొనుగోలు ఆగిపోయింది.. వెంటనే చెకోస్లేవేకియాతో ఆయుధాల బేరం మొదలైంది.
మూడు కోట్ల రూపాయలు విలువచేసే ఆయుధాలకు నిజాం ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఈ విషయాన్ని చెకోస్లేవేకియా ఇండియా గవర్నమెంటికి చెప్పింది. ఆయుధాలు అమ్మితే శత్రువుకు సహకరిస్తున్నట్లుగా పరిగణిస్తామని ఇండియా హెచ్చరించింది. ఆయుధాలు కొనుగోలు చేయకుండా, దేశంలోకి సరుకు రవాణా జరగకుండా భారత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.