కంటోన్మెంట్ బైపోల్‌కు ఈరోజు నుంచే నామినేషన్లు

కంటోన్మెంట్ బైపోల్‌కు ఈరోజు నుంచే నామినేషన్లు

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్​కంటోన్మెంట్ బైపోల్​కు సంబంధించి గురువారం నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతోంది. అధికారులు అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నామినేషన్ల ప్రక్రియ 25 సాయంత్రం 3 గంటలకు ముగుస్తుంది. 26న స్ర్కూటినీ, 29 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్​పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి కాంగ్రెస్​పార్టీ నుంచి శ్రీగణేశ్ నారాయణన్, బీఆర్ఎస్ నుంచి సాయన్న కూతురు నివేదిత, బీజేపీ నుంచి మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు వంశా తిలక్​పోటీ చేస్తున్నారు. కంటోన్మెంట్​నియోజకవర్గంలో 2లక్షల51వేల425 మంది ఓటర్లు ఉండగా, ఇందులో లక్షా25వేల735 మంది పురుషులు,లక్షా25వేల627 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారు. 

వీరితోపాటు 55 మంది సర్వీస్​ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇక్కడ మొత్తం 2లక్షల50వేల770 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 655 మంది ఓటర్లు పెరిగారు. ఉప ఎన్నిక కోసం 113 ప్రాంతాల్లో 232  పోలింగ్​కేంద్రాలు ఏర్పాటు చేశారు. 231 పోలింగ్​ కేంద్రంలో అత్యధికంగా1,567 మంది  ఓటర్లు ఉండగా, 166వ పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా 529 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి ఇక్కడి ఓటర్లు కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థితోపాటు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయనున్నారు. మల్కాజిగిరి లోక్​సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, కంటోన్మెంట్ అసెంబ్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్​  మధుకర్ నాయక్ వెల్లడించారు. 232 పోలింగ్ కేంద్రాల్లో 90 శాతం కంటోన్మెంట్ పరిధిలో,10 శాతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 49 శాతం ఓటింగ్​నమోదైందని, ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.