
- గ్రేటర్ వ్యాప్తంగా 10 లక్షల మంది మండల దీక్షలు
- కరోనా ప్రభావం లేకపోవడమే కారణం
- ఇప్పటికే కాలి నడకన శబరిమలకు స్వాములు
- 60 శాతం మంది ట్రావెల్స్, ఓన్ వెహికల్స్‌లో..
- 30 శాతం రైళ్లలో, 10 శాతం మంది ఫ్లైట్లలో ప్రయాణం
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది గ్రేటర్‌పరిధిలో దాదాపు10 లక్షల మంది భక్తులు అయ్యప్ప మాల ధరించారు. కరోనాకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా12 లక్షల మందికి పైనే మండల దీక్ష చేపట్టి శబరిమలకు వెళ్లి వచ్చేవారు. వరుస లాక్డౌన్లు, వైరస్‌ప్రభావంతో 2020లో కేవలం 3 లక్షల లోపే అయ్యప్ప మాల ధరించారు. కరోనా కేసులు తగ్గిపోవడంతో 2021లో 8 లక్షల మందికిపైగా మండల దీక్ష చేపట్టారు. ఈ ఏడాది పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మాల ధరించారు. ఇందులో సగం గ్రేటర్ పరిధిలోనే ఉన్నారు. ఇప్పటికే దీక్ష పూర్తయిన వందలాది మంది స్వాములు కాలి నడకన శబరిమల చేరుకున్నారు. అలాగే 60 శాతం మంది టూర్స్ అండ్ ట్రావెల్స్, సొంత వెహికల్స్‌లో, 30 శాతం మంది రైళ్లలో, మిగిలిన 10 శాతం మంది ఫ్లైట్లలో స్వామి దర్శనానికి వెళ్తున్నారు. దీక్ష చేపట్టిన స్వాములు కాకుండా గత నెల నుంచి మొదలు జనవరి18 వరకు రాష్ట్రం నుంచి మరో 10 లక్షల మంది సాధారణ భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ట్రావెల్స్‌కు ఫుల్ గిరాకీ
అయ్యప్ప స్వాముల సంఖ్యకు అనుగుణంగా ప్రైవేట్ ట్రావెల్స్నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెళ్లేవారి సంఖ్యను బట్టి వివిధ రకాల వెహికల్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. కొందరు కిలో మీటర్ల చొప్పున తీసుకెళ్తుండగా, మరికొందరు అప్ అండ్ డౌన్ ప్యాకే
జీలు అందిస్తున్నారు. రెండేండ్లుగా ఖాళీగా ఉన్నామని, ఈసారి ఫుల్ గిరాకీ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. కేరళలోని శబరిమలతోపాటు తమిళనాడు, కర్నాటక, ఏపీ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్యాకేజీలు అందిస్తున్నామని అంటున్నారు. ఇదే అదునుగా కొన్ని ట్రావెల్స్ కంపెనీలు టికెట్ల రేట్లను పెంచేశాయి.
రైళ్లలో వెయిటింగ్ లిస్ట్
ఈ ఏడాది శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరగడంతో రైల్వే అధికారులు 38 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉంది. నెల ముందు టికెట్‌బుక్ చేసినా ఇప్పటికీ వందకు పైగా వెయిటింగ్ చూపిస్తోంది.
రష్ను దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. డిపోల మేనేజర్లు స్థానికంగా ఉండే గురుస్వాములతో సమావే
శాలు నిర్వహించి ప్రచారం కల్పిస్తున్నారు. బస్సు మొత్తం బుక్ చేసుకుంటే ఐదుగురికి(3 ఫుల్, 2 హాఫ్టికెట్లు) ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.
కాలి నడకన వెళ్లొచ్చాం
మూడేండ్ల నుంచి కాలినడకన వెళ్లాలనుకుంటున్నాం. కరోనా కారణంగా కుదరలేదు. ఈసారి మా గ్రామం నుంచి 8 మందితో కలిసి వెళ్లొచ్చాం. 40 రోజులపాటు యాత్ర కొనసాగింది. దారిలో హైదరాబాద్‌కు చెందిన కొందరు స్వాములు కలిశారు.
- నీలి శ్రీకాంత్, గురుస్వామి, మర్పల్లి, వికారాబాద్ జిల్లా
స్పెషల్ ప్యాకేజీలు ఇస్తున్నం
ఈసారి శబరిమలకు బుకింగ్స్ బాగా అవుతున్నాయి. స్వాములకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నాం. 9 వేల నుంచి 10 వేల వరకు తీసుకుంటున్నం. ఈ ప్యాకేజీలో మొత్తం 15 పుణ్యక్షేత్రాల దర్శనంతో పాటు ఫుడ్ అందిస్తున్నాం. ఈసారి ఉన్నంత రష్ ఎప్పుడూ చూడలేదు.
- ధరమ్ కార్ సురేష్ గురుస్వామి, సాయికుమార్ టూర్స్
మరిన్ని రైళ్లు నడపాలి
ఇప్పటికే 38 రైళ్లు ఏర్పాటు చేసినా ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది. మరిన్ని రైళ్లు నడపాలి. ప్రభుత్వాలు స్పందించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. నేను 26వ సారి మాల ధరించాను. గతంలో ఎప్పుడూ ఇంత మంది మాల ధరించడం చూడలేదు.
- రవీందర్, గురుస్వామి
ముందే దర్శనానికి స్లాట్ బుకింగ్
కరోనా టైంలో 24 గంటలూ ప్రయత్నించినా అయ్యప్ప స్వామి దర్శనం స్లాట్లు దొరకలేదు. దీంతో చాలామంది స్థానిక అయ్యప్ప ఆలయాలు, శివాలయాల్లోనే దీక్ష పూర్తిచేశారు. ఈసారి స్లాట్లు ఈజీగా దొరుకుతున్నాయి. డైలీ మూడు లక్షల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. ఇటీవల ఒకేరోజు 5 లక్షల మంది దర్శనానికి వెళ్లగా, తెలుగు రాష్ట్రాల నుంచే లక్షన్నర మంది ఉన్నారు. వెళ్లే ముందు స్లాట్బుక్చేసుకుని వెళ్తే మంచిదని గురుస్వాములు సూచిస్తున్నారు.