
- రాష్ట్రానికి ఏటా లక్షన్నర మంది విదేశీ పర్యాటకులు
- 99 శాతం మంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పర్యటన
- రూరల్ ఏరియాలకు వెళ్లేది పదుల సంఖ్యలోనే..
- ఐదున్నర కోట్లకుపైగా డొమెస్టిక్ టూరిస్ట్‌లు
- ఇందులో ఆలయాల సందర్శనకే ప్రయారిటీ
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనకు వస్తున్న ఫారిన్ టూరిస్ట్‌ల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కరోనా టైంలో పూర్తిగా కుదేలైన పర్యాటక రంగం రెండేళ్లుగా క్రమంగా కోలుకుంటోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో తెలంగాణ వెనుకబడి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఆశాజనకంగా మారింది. అయితే రాష్ట్రానికి వచ్చేవారంతా హైదరాబాద్‌కే పరిమితం అవుతుండగా, రూరల్ ఏరియాలకు పదుల సంఖ్యలోనే వెళ్తుండడం గమనార్హం.
కరోనా టైంలో పడిపోయిన టూరిస్ట్‌ల సంఖ్య
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌తో 2020, 2021 సంవత్సరాల్లో ఫారిన్ టూరిస్ట్‌ల సంఖ్య అమాంతం పడిపోయింది. కరోనాకు ముందు 2020 మార్చి వరకు రెండున్నర నెలల్లోనే 46 వేల మంది ఫారిన్ టూరిస్ట్‌లు రాగా, 2021లో కేవలం 5,917 మంది మాత్రమే టూరిస్ట్ వీసాపై రాష్ట్రానికి వచ్చారు. 2022లో పరిస్థితి కాస్త మెరుగు పడడంతో ఆ ఏడాది 68,401 మంది రాష్ట్రానికి వచ్చారు. 2023లో ఆ సంఖ్య కాస్త 1,60,912కు చేరుకుంది. ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో 67,631 మంది టూరిస్ట్‌లు తెలంగాణకు వచ్చారు. వాతావరణ అనుకూలతల దృష్ట్యా జూలై నుంచి డిసెంబర్ మధ్యే ఎక్కువ మంది ఫారినర్స్ హైదరాబాద్‌కు వస్తుంటారని, అందువల్ల ఈ ఏడాది వారి సంఖ్య లక్షన్నర దాటవచ్చని టూరిజం ఆఫీసర్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువ
విదేశాల నుంచి తెలంగాణకు వస్తున్న టూరిస్ట్‌లలో 99 శాతానికిపైగా హైదరాబాద్‌నే విజిట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, కుతుబ్‌షాహీ టూంబ్స్‌తో పాటు ఇతర పురాతన కట్టడాలను సందర్శిస్తున్నారు. హైదరాబాద్ దాటి జిల్లాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పదుల సంఖ్యలోనే ఉంటోంది. గతేడాది రాష్ట్రానికి 1,60,912 మంది ఫారినర్లు వస్తే ఇందులో 1,60,545 మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాగిజిరి, వికారాబాద్ జిల్లాల్లోనే తిరిగారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ఉన్న ములుగు జిల్లాను గతేడాది 127 మంది విదేశీయులు సందర్శించగా, వేయిస్తంభాల గుడి ఉన్న హన్మకొండ జిల్లాను105 మంది, వరంగల్ కోట ఉన్న వరంగల్ జిల్లాను 99 మంది, భువనగిరి ఫోర్ట్ ఉన్న యాదాద్రి జిల్లాను 36 మంది సందర్శించారు. మిగతా జిల్లాలకు ఒక్కరు కూడా వెళ్లలేదు. ఈ ఏడాది గడిచిన ఆర్నెళ్లలో హైదరాబాద్‌కు 67,631 మంది టూరిస్ట్‌లు రాగా, వరంగల్‌కు 66 మంది, ములుగుకు 60 మంది, హనుమకొండకు 58 మంది, యాదాద్రి భువనగిరికి ఆరుగురు మాత్రమే వచ్చారు. మిగతా జిల్లాలకు ఒక్కరూ రాలేదు.
డొమెస్టిక్ టూరిస్ట్‌లు ఐదున్నర కోట్లకుపైనే...
రాష్ట్రంలోని వివిధ టూరిస్ట్ స్పాట్లను సందర్శించిన దేశీ పర్యాటకుల సంఖ్య గతేడాది 5.84 కోట్లు కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 5.35 కోట్లుగా నమోదైంది. ఇందులో ప్రకృతి సిద్ధమైన టూరిస్ట్ స్పాట్లతో పాటు జాతరలు, టెంపుల్స్‌కు వచ్చిన భక్తుల సంఖ్యను కూడా ఇందులోనే నమోదైంది. ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో అత్యధికంగా 1.43 కోట్ల మంది డొమెస్టిక్ టూరిస్ట్‌లు సందర్శించిన జిల్లాగా ములుగు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇందులో మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరిగిన ఫిబ్రవరి నెలలోనే 1.20 కోట్ల మంది టూరిస్ట్‌లు ములుగు జిల్లాకు వచ్చినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఆలాగే వేములవాడ రాజన్న కొలువైన రాజన్న సిరిసిల్లను 92.62 లక్షల మంది సందర్శించగా, హైదరాబాద్‌ను 91 లక్షల మంది, యాదాద్రి భువనగిరి జిల్లాను 65.17 లక్షల మంది సందర్శించారు. అతితక్కువగా 365 మంది దేశీ పర్యాటకులు సందర్శించిన జిల్లాగా కామారెడ్డి నిలిచింది.