కరోనాకు బలవుతున్న మావోయిస్టులు 

కరోనాకు బలవుతున్న మావోయిస్టులు 
  • మొన్న గడ్డం మధుకర్, కత్తి మోహన్​రావు
  • తాజాగా హరిభూషణ్, సారక్క మృతి
  • ప్రకటించిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‍
  • పోలీసులు చెప్పిందే నిజమైంది

భద్రాచలం/మహబూబాబాద్, వెలుగు: దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా సోకిందని, పెద్దసంఖ్యలో చనిపోతున్నారని చెబుతూ వచ్చిన పోలీసుల మాటలే నిజమవుతున్నాయి. మొన్నటికి మొన్న కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్​రావు, దండకారణ్యం డివిజన్​కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్​కరోనాతో కన్నుమూయగా, తాజాగా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు హరిభూషణ్ అలియాస్ యాపా నారాయణ, ఇంద్రావతి కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్​ భారతక్క చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్​గురువారం ప్రకటించారు. ఈ లెక్కన కరోనా రూపంలో మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లైంది. 
ఏప్రిల్​లో జరిగిన మీటింగ్​వల్లే.. 
ఏప్రిల్​ చివరి వారంలో చత్తీస్​గఢ్ ​రాష్ట్రంలోని బీజాపూర్, -సుక్మా జిల్లాల సరిహద్దుల్లో 500 మంది మావోయిస్టులతో మీటింగ్​జరిగిందని, ఈ సమయంలో సుమారు 50 మంది సాయుధ నక్సల్స్ కు కొవిడ్​ సోకిందని ఇటీవల పోలీసులు వెల్లడించారు. 10‌‌‌‌‌‌‌‌ మంది మావోయిస్టులు చనిపోయినట్లు మే 10న దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్  ప్రకటించారు. కొవిడ్​ సోకిన మావోయిస్టులు లొంగిపోతే రివార్డుతో పాటు ట్రీట్​మెంట్​అందిస్తామని బస్తర్ ఐజీ సుందర్​రాజ్​తో పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్​దత్​ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. నాడు మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్​ ఇదంతా దుష్ప్రచారమని, ఎవరూ కరోనా బారినపడలేదని కొట్టిపారేశారు. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను బట్టి పెద్దసంఖ్యలో మావోయిస్టులకు కరోనా సోకినట్లు స్పష్టమవుతోంది.
చికిత్స కోసం వచ్చి పోలీసులకు చిక్కి.. 
కరోనా సోకి చికిత్స కోసం వచ్చిన దండకారణ్యం డివిజన్​ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్​ఈ నెల 1న  హన్మకొండ ములుగు క్రాస్​రోడ్డు వద్ద పోలీసులకు చిక్కాడు. అప్పటికే కొవిడ్​తో పరిస్థితి సీరియస్​ కావడంతో హైదరాబాద్​లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ తర్వాత  కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్​రావు అలియాస్​ ప్రకాశన్న కూడా కరోనాతో కన్నుమూశాడు. ఈ విషాదం నుంచి మావోయిస్టులు తేరుకోకముందే తాజాగా ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్​, 22న ఇంద్రావతి కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్‍ భారతక్క  చనిపోయారు. తాజాగా ఈ విషయాన్ని మా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‍ ప్రకటించారు. బ్రాంకైటిస్‍, అస్తమాకు కరోనా తోడై ఈ నెల 21న ఉదయం 9 గంటలకు హరిభూషణ్​ చనిపోయారని చెప్పారు. రెండు రోజులుగా హరిభూషణ్​ మృతిపై స్పష్టత రాకపోవడంతో అటు ఆయన కుటుంబ సభ్యులతోపాటు మావోయిస్టు సానుభూతిపరుల్లోనూ ఒకింత ఉత్కంఠ నెలకొంది.  22న చనిపోయిన సారక్క, 12 రోజుల క్రితం చనిపోయిన కత్తిమోహన్​రావు భార్య. 29 ఏండ్ల వీరి వైవాహిక జీవితానికి 12 రోజలు వ్యవధిలో తెరపడినట్లయింది. ఇద్దరు మావోయిస్టుల మృతితో ఇటు మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలంలోని హరిభూషణ్​ స్వగ్రామం మడగూడెంలో,  అటు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని సారక్క స్వగ్రామం కాల్వపల్లి లో విషాదఛాయలు అలుముకున్నాయి.