
కర్ణాటక రాష్ర్టం కొప్పళ జిల్లా బసరిహాల గ్రామంలో కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన వారిలో మృతుల సంఖ్య 3 కి చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజకల్ గ్రామానికి చెందిన బాలిక నిర్మలా ఎరప్ప బెళగల్ కలుషిత నీటిని తాగిన వెంటనే వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కలుషిత నీటితో ఆరోగ్యాలు పాడయ్యి, మరణాలు సంభవిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే తాగునీరు మురుగునీటితో కలుస్తోందని వారు ఆరోపించారు.
రక్త పరీక్షలు చేస్తాం...
గ్రామాల్లో కలరా విజృంభిస్తోందన్న అనుమానాల నడుమ తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించి రోగులకు రక్త పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారి అలకానంద మాలగి తెలిపారు. పరిసర గ్రామాల నీటి నమూనాలను ల్యాబ్స్ కి పంపినట్లు చెప్పారు. బాలిక మృతికి కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు. జూన్ 5న జిల్లాలోని బసరిహాల గ్రామంలో కలుషిత నీరు తాగి తొమ్మిది నెలల చిన్నారి, 60 ఏళ్ల వృద్ధురాలు ఆస్పత్రిలో మృతి చెందారు.