పెరిగిన మహిళా సర్పంచ్ల పాత్ర

పెరిగిన మహిళా సర్పంచ్ల పాత్ర

గ్రామాలు  ప్రజాస్వామ్య మూలాలు.  భారతదేశంలో గ్రామీణ పాలనా వ్యవస్థలో  పంచాయతీరాజ్ అత్యంత కీలకం. 73వ  రాజ్యాంగ సవరణ (1992)ద్వారా బలోపేతమైన ఈ వ్యవస్థ గ్రామాల అభివృద్ధికి పునాది వేసింది. అయితే, కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు పంచాయతీలకు నిజంగా ఊతమిస్తాయా?  పల్లెలను అభివృద్ధి గాడిలో పెడతాయా?  కొత్త సర్పంచ్‌‌‌‌లకు, ముఖ్యంగా మహిళా సర్పంచ్‌‌‌‌లకు ప్రోత్సాహం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలు గ్రామీణ భారతంలోని ప్రతి ఒక్కరి మదిలో తిరుగుతున్నాయి.  పంచాయతీ పాలనలో  మహిళా భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతున్నది.  మహిళలకు కనీసం 50%  రిజర్వేషన్ కల్పించడంతో గ్రాస్‌‌‌‌రూట్ స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. 

 పల్లెల అభివృద్ధిలో మహిళల కీలకపాత్ర

 ప్రస్తుతం 21 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 50% రిజర్వేషన్ అమలవుతోంది.  దీంతో  దాదాపు 31 లక్షల ఎన్నికైన ప్రతినిధుల్లో సుమారు 14.5 లక్షలు (46% కంటే ఎక్కువ) మహిళలు ఉన్నారు.  ఇది  ప్రపంచంలోనే మహిళా ప్రాతినిధ్యంలో అతిపెద్ద స్థాయి . ఇక తెలంగాణలో ఉన్న 12,702  గ్రామ పంచాయతీల్లో 5,878 మహిళా సర్పంచులున్నారు.  తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మహిళలకు 50% రిజర్వేషన్ ఉండాల్సి ఉండగా, 2025 ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల సుమారు 45–-46%కి పరిమితమవ్వడం ఆందోళకరం.  రాష్ట్రాభివృద్ధఙ ముఖ్యంగా పల్లెల్లో అభివృద్ధిలో మహిళల పాత్రే ముఖ్యమైనది. మొన్నటి వరకు ఇల్లును  సగబెట్టిన  నాలాంటి మహిళలు ఇవాళ ఊరును  నిలబెట్టేందుకు  పల్లెల్లో  సర్పంచ్ లుగా ఎన్నికవ్వడం సంతోషం.  ప్రత్యేకించి నేను గృహిణిలా ఇల్లు సగబెట్టిన దాన్ని.  పిల్లలు ఎదిగి చదువులు.. పై చదువులు పూర్తై  తమభారం తామే మోయగలిగేనాటికి  ఊరు నిలబెట్టాలనే ఆలోచన వచ్చింది.  ఆ ఆలోచన రావడమే తరువాయి రాజ్యాంగంలోని 73వ సవరణ  ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని ఏలగలిగే  రాజీవ్ గాంధీ  తాలూకు హామీ నన్ను  మా  గ్రామ పంచాయతీ  సర్పంచ్​గా నిలవాలనే దిశగా పురిగొల్పింది.  

పల్లెల్లో ప్రజాస్వామ్యం

పల్లెల్లోని  ప్రజాస్వామ్య మూలాలతో  నాయకత్వాన్ని  పొందగలిగి  ఒక గ్రామాన్ని  పురోగమింపజేసే స్థితి నెలకొన్నప్పుడు ఆ ప్రక్రియలో నాకూ ఉండాలనిపించింది.  తెలంగాణలోని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం  మా ఊరు.  రాజ్యాంగం ద్వారా  సంక్రమించిన రిజర్వేషన్ల ఊతంగా మా ఊరు బీసీ మహిళకు కేటాయిస్తే  నేను ఆ రిజర్వేషన్  ఆధారంగా ఒక్కొక్క అడుగు వేయాలని సంకల్పించాను.  దానికి కుటుంబ తోడ్పాటు, మా గ్రామ ప్రజల ప్రోత్సాహం.. వీటన్నిటికీ మించి నాలో నాయకత్వ లక్షణాలకు స్ఫూర్తిదాయకంగా  నిలిచిన  మా ప్రాంత ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి  ప్రేరణ నన్ను మా ఊళ్లో సర్పంచ్ పదవికి నిలిచేలా చేశాయి.  ముందుగా, పంచాయతీలకు  ఆర్థిక సహాయం  గురించి  మాట్లాడుకుందాం.  కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థికసంఘం పంచాయతీలకు భారీగా నిధులు విడుదల చేస్తోంది.  అస్సాం రాష్ట్రంలోని పంచాయతీలకు ఇటీవల రూ. 219.24 కోట్లు విడుదలయ్యాయి.  తెలంగాణలో కూడా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు దాదాపు రూ. 3,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. 

మహిళా సర్పంచ్‌‌‌‌లకు ప్రోత్సాహం

2020-–21 నుంచి 2025-–26 వరకు పంచాయతీలకు రూ.10 లక్షల కోట్లు కేటాయించాలని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ నిధులు గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యంవంటి రంగాల్లో ఖర్చు చేయడానికి  ఉపయోగపడతాయి.  ఇలాంటి ఆర్థిక ఊతంతో  పల్లెలు గాడిలో  పడుతున్నాయని చెప్పవచ్చు.  నిధులు ఒక్కటే  సరిపోవు.  పాలనా సామర్థ్యం పెంచడం కూడా ముఖ్యం.  ఇందుకోసం  పంచాయతీ డెవలప్‌‌‌‌మెంట్ ప్లాన్ (పీడీపీ) ప్రచారం-2 వంటి కార్యక్రమాలు ఉన్నాయి.  ఇవి గ్రామాల ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం స్థానిక వనరులను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తాయి.  నేషనల్ పంచాయతీ అవార్డ్స్ 2025 ద్వారా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన  పంచాయతీలను  ప్రోత్సహిస్తున్నారు.  కొత్త సర్పంచ్‌‌‌‌లకు ఇది పెద్ద ప్రోత్సాహం.  ముఖ్యంగా మహిళా సర్పంచ్‌‌‌‌ల గురించి మాట్లాడుకుంటే... కేంద్రం కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ప్రారంభించింది.  ఇది మహిళల నాయకత్వం, నిర్ణయాధికారాన్ని పెంచుతుంది.  

గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి

క్వాలిటీ  కౌన్సిల్  ఆఫ్  ఇండియా సర్పంచ్ సంవాద్ ప్లాట్‌‌‌‌ఫాం ద్వారా మహిళా సర్పంచ్‌‌‌‌లకు శిక్షణ ఇస్తోంది. ఎన్ఐపీసీసీడీ వంటి సంస్థలు మహిళలకు లీడర్‌‌‌‌షిప్, పాలనా నియమాలు, ప్రోగ్రామ్‌‌‌‌లపై శిక్షణ ఇస్తున్నాయి. మోడల్ విమెన్ -ఫ్రెండ్లీ గ్రామ్  పంచాయతీల ఇనిషియేటివ్  ద్వారా వర్చువల్  ట్రైనింగ్ ప్రోగ్రామ్‌‌‌‌లు అందుబాటులో ఉన్నాయి.  ఇల్లు సక్రమంగా నిర్వహించే మహిళలు ఊరిని కాపాడే సర్పంచ్‌‌‌‌లుగా మారడానికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుంది.  ఇటీవల చర్యల్లో వికసిత్ భారత్- గ్రామ్ గ్యారంటీ ఫర్  రోజ్‌‌‌‌గార్  అండ్  అజీవిక మిషన్ (జీ రామ్ జీ) యాక్ట్ 2025 వంటివి గ్రామీణ ఉపాధి పాలసీలో మార్పు తెచ్చాయి. పెసా ఆక్ట్ ద్వారా గిరిజన సమాజాలకు  అధికారాలు  వికేంద్రీకరణ  చేస్తున్నారు.  ఏది ఏమైనా  ప్రభుత్వాల సహకారం పెరుగుతోంది. ఈ నిధులు, శిక్షణలు క్షేత్రస్థాయికి చేరాలి.  పల్లెలు బాగుపడటమే ప్రధాన లక్ష్యం కావాలి.  కొత్త సర్పంచ్‌‌‌‌లు, మహిళలు సవాళ్లు ఎదుర్కొన్నప్పుడు మరిన్ని సపోర్ట్  సిస్టమ్‌‌‌‌లు అవసరం.  గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యం.  ప్రభుత్వాలు ఈ దిశగా మరింత ముందుకుసాగాలని కోరుకుంటున్నాను. 

- రేణుక గుంటిపల్లి,
సర్పంచ్, ముప్పారం 
హనుమకొండ జిల్లా