ఆలయ  భూముల ఆక్రమణ నిజమే

ఆలయ  భూముల  ఆక్రమణ నిజమే

వరంగల్​లో కబ్జాలపై లోకాయుక్తకు ఎండోమెంట్ ​ఆఫీసర్ల రిపోర్ట్

వరంగల్, వెలుగు: వరంగల్​నడిబొడ్డున ఐదు ప్రధాన టెంపుల్స్​కు చెందిన దాదాపు రూ.300 కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతమైన మాట నిజమేనని ఎండోమెంట్ ​ఆఫీసర్లు తేల్చారు. లోకాయుక్త ఆదేశాలతో డిజిటల్​ సర్వే పూర్తిచేసి, కబ్జాలపై తాజాగా  రిపోర్ట్​ సమర్పించారు. ఇందులో హన్మకొండ జిల్లా హెడ్‍క్వార్టర్‍లో ప్రైమ్‍ లొకేషన్‍గా చెప్పుకునే పద్మాక్షి, సిద్దేశ్వర, వీరపిచ్చమాంబ ఆలయాలకు చెందిన దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల విలువ చేసే భూములున్నాయి. వీటితోపాటు హన్మకొండ బ్రాహ్మణవాడలోని రంగనాయక స్వామి, వరంగల్​లోని వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన మరో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల విలువ చేసే భూములు కబ్జాదారుల పాలయ్యాయని తేలింది. 
 

ఓరుగల్లు బతుకమ్మ ఆడే స్థలం హాంఫట్​ 


హన్మకొండ పద్మాక్షి టెంపుల్ ​స్థలంలో బతుకమ్మ  ఆడే స్థలంపై కొందరు పెద్దల కండ్లు పడ్డాయి. పద్మాక్షి, సిద్దేశ్వర, వీరపిచ్చమాంబ ఆలయాలకు చెందిన సుమారు 10 ఎకరాల స్థలాన్ని లీడర్ల ముసుగులో ఉన్న అక్రమార్కులు కొద్దికొద్దిగా కబ్జా చేస్తూ వచ్చారు. ఈ ప్రాంతంలో గజం రూ.30 నుంచి 40 వేలు పలుకుతోంది. ఈ లెక్కన ఒక్కో ఎకరానికి రూ.15 కోట్ల నుంచి రూ.19 కోట్ల చొప్పున..10 ఎకరాలకు రూ.150 కోట్ల నుంచి రూ.190 కోట్ల వరకు ఉంది. ఇదంతా వారి ఆక్రమణలోకి వెళ్లిపోయింది. ఇవేగాక హన్మకొండ చిన్న, పెద్ద కోవెల ప్రాంతంలోని రంగనాయకస్వామి ఆలయానికి బ్రాహ్మణవాడ, ములుగురోడ్‍, పెద్దమ్మగడ్డ ఏరియాల్లో ఉన్న 9.32 ఎకరాలు, వరంగల్​లోని వేణుగోపాలస్వామి గుడికి చెందిన 1.11 ఎకరాల భూమిని ఆక్రమించారు. వీటి విలువ ఎంత లేదన్నా రూ.150 కోట్లు పలుకుతోంది.  

కబ్జాదారుల్లో అధికార పార్టీ లీడర్లు

హన్మకొండలో బతుకమ్మ ఆడే సిద్దేశ్వర ఆలయానికి చెందిన 2.24 ఎకరాల భూమి కబ్జాకు గురికాగా, ఇందులో అధికార పార్టీకి చెందిన వరదారెడ్డి ఎస్‍ఆర్‍ కాలేజీని 1089 గజాల్లో నిర్మించారు. ఇవేగాక వేరేవాళ్లకు చెందిన మరికొన్ని బిల్డింగులు కూడా ఉన్నాయి. పద్మాక్షి టెంపుల్‍కు సంబంధించి 6.22 ఎకరాలు కబ్జాకు గురి కాగా , ఇందులో ఓ టీఆర్‍ఎస్‍  లీడర్‍ సపోర్ట్​తో రోడ్డు పక్కనే పెట్టిన పెట్రోల్‍ బంక్‍తో పాటు శ్మశాన వాటికలు, ఐటీఐ కాలేజీ, ఓ సొసైటీతో పాటు ఆరుగురు వ్యక్తులకు చెందిన కట్టడాలున్నాయి. వీరపిచ్చమాంబకు సంబంధించి 30 గుంటలు కబ్జా కాగా, 20 గుంటల్లో అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్‍ నిర్మించిన అపార్ట్​మెంట్ ఉంది. వేణుగోపాలస్వామి టెంపుల్​కు చెందిన 1.11 ఎకరాల స్థలంలో ఓ స్కూల్‍, గార్డెన్‍ ఉండగా, మొత్తం 12 మంది ఆక్రమణదారులుగా తేలారు. ఎక్కువగా రంగనాయకస్వామి ఆలయానికి చెందిన 9.32 ఎకరాల స్థలంలో 34 మంది ఆక్రమణల్లో ఉన్నట్లు ఎంక్వైరీలో తేల్చారు.  
 

ఏండ్ల తరబడి పొలిటికల్‍ వార్‍

ఐదు టెంపుల్‍ ల్యాండ్స్​కబ్జా కాగా, ప్రధానంగా పద్మాక్షి, సిద్దేశ్వర, వీరపిచ్చమాంబ ఆలయాలకు చెందిన భూకబ్జాలపై మాత్రమే ఏండ్ల తరబడి పొలిటికల్‍ వార్‍ నడుస్తోంది. జిల్లాల్లో ఏ ఎన్నికలు వచ్చినా అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచేది ఈ టాపిక్​మీదే. అలాగే బతుకమ్మ ఆడే స్థలం కబ్జాపై వెలుగు పేపర్‍లో స్టోరీలు  పబ్లిష్​ అయ్యాయి. దీంతో గతేడాది ‘రాష్ట్ర వినియోగదారుల మండలి, కాకతీయ ఆస్తుల పరిరక్షణ వేదిక’ లోకాయుక్తలో కంప్లయింట్​ చేసింది.    

కోర్టు ఆదేశాలతో..డిజిటల్‍ సర్వే

కబ్జా విషయాన్ని లోకాయుక్త సీరియస్‍గా తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో దేవాదాయశాఖకు చెందిన భూములు ఎన్ని ఉన్నాయో తేల్చాలని జస్టిస్‍ సీవీ.రాములు డిజిటల్‍ సర్వేకు ఆదేశించారు. ఎండోమెంట్‍, గ్రేటర్‍, సర్వే ఆఫీసర్లు కో ఆర్డినేషన్‍తో సర్వే చేయాలని ఆదేశించారు. దీంతో  ఎన్ని అవాంతరాలు వచ్చినా సర్వే పూర్తి చేశారు.  వరంగల్‍ జోన్‍ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‍ టి.శ్రీకాంతరావు, అసిస్టెంట్‍ కమిషనర్‍ వీరస్వామి, అసిస్టెంట్‍ డైరెక్టర్‍ ప్రభాకర్ టీమ్​రిపోర్ట్​ను గురువారం లోకాయుక్తకు అందజేసింది.  

లోకాయుక్తకు  ఫిర్యాదు చేసినం


వందల కోట్ల విలువ చేసే ఆలయాల భూములు కబ్జా విషయం మా దృష్టికి రాగా లోకల్‍ లీడర్లు, జిల్లా ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో లోకాయుక్తలో కంప్లయింట్ చేశాం. వారు డిజిటల్‍ సర్వే చేయించి కబ్జాలు నిజమేనని తేల్చారు. దాదాపు 21 ఎకరాల ల్యాండ్‍ ఆక్రమణకు గురైనట్లు రిపోర్ట్​ ఇచ్చారు. అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
                                                                                                                                                                                                                   – సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి అధ్యక్షుడు

స్వాధీనం చేసుకోవాలే 


ఏండ్ల తరబడి ఆలయ భూములను కొందరు లీడర్లు ఆక్రమించారు. కోర్టు జోక్యం చేసుకోవడంవల్లే నిజమేమిటో తెలిసింది. కబ్జా చెరలో ఉన్న దేవాదాయశాఖ ఆస్తులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. బతుకమ్మ ఆటకు ఉపయోగపడేలా డెవలప్​చేయాలి.  
                                                                                                                                                                                                                            – చీకటి రాజు (కాకతీయ ఆస్తుల పరిరక్షణ వేదిక కన్వీనర్‍)