ఇబ్రహీంపట్నం కేజీబీవీ లోపలికి వెళ్లేందుకు అనుమతి నిరాకరణ

ఇబ్రహీంపట్నం కేజీబీవీ లోపలికి వెళ్లేందుకు అనుమతి నిరాకరణ

ఎల్ బీ నగర్, వెలుగు: ఇబ్రహీంపట్నంలోని కస్తూర్బా రెసిడెన్షియల్ హాస్టల్​లో పిల్లలను కలిసేందుకు  వారి తల్లిదండ్రులకు అధికారులు అనుమతివ్వడం లేదు. హాస్టల్​లో కనీస వసతులు కల్పించాలంటూ స్టూడెంట్లు ఇటీవల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. దీంతో హాస్టల్​ను అధికారులు వారి కంట్రోల్​లోకి తీసుకున్నారు. శనివారం తమ పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులను అనుమతించకపోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

పిల్లలు ఎలా ఉన్నారోనని చూసేందుకు వస్తే లోపలికి పంపట్లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు స్టూడెంట్లను రూమ్​లో పెట్టి డోర్లు వేయడం వివాదాస్పదంగా మారింది.  గంటల తరబడి  స్టూడెంట్ల తల్లిదండ్రులు అక్కడే కూర్చున్నా అధికారులు స్పందించలేదు. ‘చదువు లేకున్నా సరే.. తమ పిల్లల్ని పంపించండి’ అంటూ వారు పోలీసులను వేడుకున్నారు. ఈ క్రమంలో ఓ స్టూడెంట్ తల్లి అస్వస్థతకు గురైంది. మీడియాను సైతం లోపలికి అనుమతించ లేదు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ఆగమైందని..విద్యా శాఖ నిద్రపోతోందని జర్నలిస్టు తీన్మార్ మల్లన్న ఆరోపించారు. సమస్యలతో సతమవుతున్న కన్నబిడ్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులను లోపలికి పంపకపోవడంపై ఆయన మండిపడ్డారు. కేజీబీవీ స్టూడెంట్ల సమస్యలు తెలుసుకునేందుకు తీన్మార్ మల్లన్న టీమ్ శనివారం అక్కడికి వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులతో  ఆయన మాట్లాడారు. ఆరోగ్య, విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయాలని మల్లన్న డిమాండ్ ​చేశారు.