
హైదరాబాద్/వికారాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలను ఇస్తోంది. గత నెల 1 నుంచి 31వ తేదీ వరకు 3,076 మంది బాలలను రెస్క్యూ చేసినట్లు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్ అడిషనల్ డీజీ శిఖాగోయల్ వెల్లడించారు. వీరిలో 2,772 మంది బాలురు, 304 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు. కనిపించకుండాపోయిన చిన్నారులతోపాటు, బాల కార్మికులు, బెగ్గింగ్ మాఫియా చేతిలో చిక్కుకున్న వారిని కాపాడినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లోని120 సబ్ డివిజన్స్‌లో 676 మంది పోలీసులు ఆపరేషన్ ముస్కాన్‌లో పాల్గొన్నారన్నారు.
వీరితోపాటు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, లేబర్, హెల్త్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్, ఎన్జీఓలు పాల్గొన్నాయన్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్, దర్పణ్, చైల్డ్ ట్రాకింగ్ పోర్టల్ ద్వారా బాలలను గుర్తించామని చెప్పారు. చిన్నారులతో పనులు చేయిస్తున్న షాపుల యజమానులపై జువైనల్ జస్టిస్ యాక్ట్‌తో పాటు లేబర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 173 మంది బాలలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. వీరిలో 151 మంది బాలురు, 22 మంది బాలికలు ఉన్నారని చెప్పారు.