బీజేపీలో ఆ రెండు స్థానాలపై సస్పెన్స్

బీజేపీలో ఆ రెండు స్థానాలపై సస్పెన్స్
  • బీజేపీ ఆశావహుల్లో ఆందోళన
  • మూడో లిస్ట్ కోసం ఎదురు చూపులు
  • జనసేన పొత్తుతో మారనున్న సమీకరణలు

సిద్దిపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల  ఘట్టం దగ్గరపడుతున్నా సిద్దిపేట  జిల్లాలోని రెండు సెగ్మెంట్లకు బీజేపీ అభ్యర్థులు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.  ఇప్పటికే దుబ్బాక, గజ్వేల్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన హైకమాండ్​ సిద్దిపేట, హుస్నాబాద్  అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. ఇప్పటి వరకు బీజేపీ రెండు లిస్ట్ లు విడుదల చేసి 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. మూడో లిస్టులో నైనా తమకు టికెట్​ కన్ఫామ్​ అవుతుందా లేదా అనే ఆందోళనలో సిద్దిపేట, హుస్నాబాద్ ఆశావహులు ఉన్నారు.

జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.  సిద్దిపేట, హుస్నాబాద్ బీజేపీ శ్రేణులు టికెట్ ఎవరికి దక్కుతుందోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  సెకండ్ లిస్ట్ లో జిల్లాకు చెందిన రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తారని  అందరు భావించారు కానీ అలా జరగలేదు.  

సిద్దిపేట  టికెట్ కోసం 21 దరఖాస్తులు

సిద్దిపేట అసెంబ్లీ బీజేపీ టికెట్ కోసం 21 మంది అప్లై చేసుకున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ముఖ్యులంతా టికెట్  కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, గతంలో పోటీ చేసి ఓడిపోయిన నాయిని నరోత్తం రెడ్డి, విద్యాసాగర్,  భైరి శంకర్ ముదిరాజ్, ఉడుత మల్లేశం యాదవ్,  వెంకటేశం, పత్తి శ్రీనివాస్, కొత్తపల్లి వేణుగోపాల్ తో పాటు మరో 14 మంది అప్లై చేసుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలనే డిమాండ్ ను కొందరు  ఆశావహులు హైకమాండ్​ ముందుంచినట్టు తెలుస్తోంది.  

హుస్నాబాద్ లో టికెట్ ఎవరికి దక్కేనా..

హుస్నాబాద్ బీజేపీ టికెట్ కోసం  బొమ్మ  శ్రీరాం చక్రవర్తి,  జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి, లక్కిరెడ్డి తిరుమల, మంజుల రెడ్డితో పాటు మరో నలుగురు అప్లై చేసుకున్నారు. వీరిలో బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బండి సంజయ్ మద్దతుతో  శ్రీరాం చక్రవర్తి, ఈటల రాజేందర్ ఆశీస్సులతో జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా క్షేత్ర స్థాయిలో ప్రచారం ప్రారంభించారు.

 హుస్నాబాద్ నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో  కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని నిలబెట్టగా.. బీజేపీ కూడా ఈ సమీకరణల పై నిర్ణయం తీసుకుంటే  బీసీ వర్గానికి చెందిన బొమ్మ శ్రీరాం చక్రవర్తికి టికెట్ దక్కే అవకాశం ఉంది.  హుస్నాబాద్ టికెట్ విషయంపై హైకమాండ్ ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత తొందరగా ప్రచారం చేయడానికి నేతలు సిద్దంగా ఉన్నారు. 

పొత్తుతో సీన్ మారుతుందా...?

జనసేనతో బీజేపీ పొత్తు చర్చలు కొనసాగుతుండటం వల్ల హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి ప్రకటన పెండింగ్ లో పెట్టినట్లు నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ నుంచి జన సేన పోటీ చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించడంతో స్థానిక నేత శ్రీనివాస్ పోటీకి సిద్దం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సూచనతో  రాష్ట్ర బీజేపీ నేతలు జనసేన నేత పవన్ కల్యాణ్​తో చర్చలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

ALSO READ : కామారెడ్డిపైనే బీఆర్ఎస్ ఫోకస్ .. మూడు రోజుల పాటు పర్యటించనున్న పార్టీ ముఖ్యనేతలు

పొత్తులో భాగంగా జనసేనకు హుస్నాబాద్ టికెట్​కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటనేది స్థానిక నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ టికెట్ ఖచ్చితంగా ఇస్తానంటే పార్టీలో చేరడానికి మాజీ ఎమ్మెల్యే ఒకరు సుముఖత వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.