
హైదరాబాద్, వెలుగు : రాబోయే కాలంలో రాష్ట్రంలో విప్లవం వస్తుందని, బీఎస్పీ అధికారంలోకి రానుందని ఆ పార్టీ ఎంపీ రాంజీ గౌతమ్ అన్నారు. తెలంగాణ నాయకత్వం బలంగా పనిచేస్తోందన్నారు. పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. శుక్రవారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి రాంజీ మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని, ఆదివాసులు.. దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. బీఎస్పీ మాత్రమే దేశంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ వర్గాల కోసం పని చేస్తుందన్నారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నాయకులు, నియోజకవర్గ నేతలు, రాష్ట్ర నేతలు మరింత పని చేయాలని, నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. ఈ నెల 28 నుంచి బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు.