
- ఫొటోలు, వీడియోలు తీసి పోలీస్ ఎక్స్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు
- రూల్స్ బ్రేక్ చేస్తున్న పోలీసులనూ వదలట్లే..
- జనం పెట్టే పోస్టులపై వెంటనే స్పందిస్తున్న పోలీస్ శాఖ
- సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు
- కేసులు19,683
- జరిమానాలు 75 లక్షలు
హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నోళ్లను జనమే పట్టిస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తున్నోళ్ల ఫొటోలు, వీడియోలు తీసి.. పోలీస్ ఎక్స్ ఖాతా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. నిబంధనలు పాటించని పోలీసులను, ప్రభుత్వ వాహనాలను కూడా వదలట్లేదు. పబ్లిక్ డొమైన్‌లో జనం పెడ్తున్న ఈ ఫొటోలు, వీడియోలపై పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు.
రూల్స్ బ్రేక్ చేస్తున్నోళ్లు ఎంతటివారైనా సరే పోలీసులు వెంటవెంటనే కేసులు పెట్టి ఫైన్లు వేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ప్రధానంగా సిగ్నల్ జంపింగ్, స్టాప్‌లైన్ క్రాసింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ వల్ల పెద్దసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్మెట్ లేకుండా డ్రైవ్‌చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. నో పార్కింగ్ ప్లేసుల్లో వెహికల్ పార్క్ చేస్తూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నారు.
రోడ్లపై ఆవారాలు న్యూసెన్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడం, తగినన్ని సీసీ టీవీ కెమెరాలు లేకపోవడంతో ఈ రూల్స్బ్రేకర్స్కు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. ఈ క్రమంలో వీరి ఆట కట్టించేందుకు సైబరాబాద్పోలీసులు కొద్ది నెలల క్రితం స్మార్ట్ పోలీసింగ్ ప్రారంభించారు. ఎవరైనా ట్రాఫిక్రూల్స్బ్రేక్చేస్తే ఫొటో తీసి తమ ఎక్స్, వాట్సప్ఖాతాల్లో పోస్ట్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో జనం స్పందిస్తున్నారు. ట్రాఫిక్‌రూల్స్ బ్రేక్ చేస్తున్నోళ్ల ఫొటోలు తీసి పోలీస్అఫీషియల్ట్విట్టర్, వాట్సాప్ ఖాతాల్లో షేర్చేస్తూ సోషల్ మీడియాలో ట్రాఫిక్ సీపీలు, డీసీపీలు సహా ఉన్నతాధికారులకు ట్యాగ్ చేస్తున్నారు.
19,683 కేసులు..
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పబ్లిక్‌నుంచి ఫిర్యాదు కోసం తమ అఫీషియల్ఎక్స్ఖాతాతో పాటు 9490617346 వాట్సాప్ నంబర్ వాడుతున్నారు. దీనిని విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 13 వరకు ప్రజల నుంచి వేలాది ఫిర్యాదులు అందాయి. ప్రజలు ఇస్తున్న ఫొటోలు, వీడియోలు తీసిన టైమ్, ప్లేస్, ఇతరత్రా వివరాలను వెరిఫై చేసి ఇప్పటి వరకు19,683 కేసులు నమోదు చేశారు. సంబంధిత వాహనదారులపై రూ.75లక్షలకు పైగా జరిమానాలు విధించారు. ఎక్కువ టైమ్ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు సైతం జనం అక్కడి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పెడ్తున్నారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేస్తుండడం విశేషం.
నిమిషాల్లో రెస్పాన్స్..
పోలీస్ అఫీషియల్ ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల్లో ప్రజలు ఫొటోలు షేర్చేసి.. వాటిని ఉన్నతాధికారులకు ట్యాగ్ చేస్తుండడంతో పోలీసులు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. రూల్స్ పాటించని వాహనం ఏరియా, టైమ్ తెలుసుకుని చలాన్ జనరేట్ చేస్తున్నారు. వాయిలేషన్‌ను బట్టి ఆయా సెక్షన్స్ కింద జరిమానాలు విధిస్తున్నారు. ఇలా జనరేట్ చేసిన చలాన్లను ఫొటోలతో సహా ఈ చలాన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
ఐదు చలాన్స్ కంటే ఎక్కువ పెండింగ్ చలాన్స్ ఉన్న వెహికల్ ఓనర్స్‌కి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలాంటి వెహికల్స్‌ను ట్రాఫిక్ పోలీస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చెకింగ్‌లో అడ్డుకుంటున్నారు. చలాన్లు క్లియర్ చేసేంత వరకు వెహికల్‌ను తమ అధీనంలో పెట్టుకుంటున్నారు. సరైన నంబర్ ప్లేట్స్ లేకుండా తిరిగే వాహనాలను సస్పెక్ట్ లిస్ట్‌లో పెడుతున్నారు.