హత్నూర మండలంలో..ఏడేళ్లుగా విభజన కష్టాలు

హత్నూర మండలంలో..ఏడేళ్లుగా విభజన కష్టాలు
  • నియోజకవర్గం ఒక జిల్లాలో.. ఆఫీసర్లు మరో జిల్లాలో
  • అవస్థలు పడుతున్న హత్నూర మండల ప్రజలు 
  • కుంటుపడిన మండల అభివృద్ధి

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : హత్నూర మండల ప్రజలు ఏడేళ్లుగా విభజన కష్టాలు అనుభవిస్తున్నారు. జిల్లాల పునర్విభజన ఆ మండల ప్రజానీకానికి శాపంగా మారింది. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న హత్నూర మండలం 33 జీపీలతో అతిపెద్ద మండలంగా విస్తరించి ఉంది. కానీ ఈ మండలం మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చేలా విభజన జరిగింది.

పొలిటికల్ లీడర్ల కారణంగా హత్నూర మండలం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఈ  మండలాన్ని మెదక్ జిల్లాకు చెందిన పొలిటికల్ లీడర్లు శాసిస్తుండగా, పాలనపరంగా సంగారెడ్డి జిల్లా ఆఫీసర్లు బాగోగులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గడిచిన ఏడేళ్లుగా నర్సాపూర్ ఎమ్మెల్యేలతో వివిధ శాఖల ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపం ఏర్పడి మండల అభివృద్ధి కుంటుపడింది.  

 సమస్య ఒక్కటే.. తిరగాల్సింది నాలుగు దిక్కులు

మండల ప్రజలకు ఏదైనా సమస్య తలెత్తితే నాలుగు దిక్కులు తిరగాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెవెన్యూ, పోలీసు, కోర్టు వ్యవహారాలు, రిజిస్ట్రేషన్, ఎస్బీవో, ఎక్సైజ్ ఆఫీసులు వేర్వేరు మండలాల్లో ఉండడం సమస్యగా మారింది. కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో ఆఫీసులు హత్నూర మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల పరిధిలో సంగారెడ్డిలో ఉండడం కాస్త ఊరట కలిగిస్తున్నప్పటికీ మిగతా వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ప్రజలకు తలకుమించిన భారమవుతోంది. ఆందోల్-జోగిపేట్ కేంద్రంగా రిజిస్ట్రేషన్, ఎస్టీవో, ఎక్సైజ్ ఆఫీసులు కొనసాగుతున్నాయి.

హత్నూర నుంచి జోగిపేటకు 35 కిలోమీటర్ల దూరం ఉండగా, ఇదే మండలంలోని నాగారం, రొయ్యపల్లి గ్రామాలు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక ఏదైనా సమస్య తలెత్తి సీఐని కలవాలంటే 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిన్నారం మండల కేంద్రానికి వెళ్లక తప్పదు. అలాగే డీఎస్పీ స్థాయిలో పరిష్కరించుకునే సమస్యలకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటాన్ చెరు వెళ్లాల్సిందే. 

ప్రధాన సమస్యలెన్నో..

మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే నర్సాపూర్ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి.  అందులో ఒక్క హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంచారు. ఈ జిల్లాలో అతిపెద్ద మండలంగా ఉన్న హత్నూరకు సొంతంగా మార్కెట్ కమిటీ లేదు. విభజన టైంలో మార్కెట్ కమిటీ చేస్తామన్న హామీ.. హామీగానే మిగిలిపోయింది. అప్పట్లో డివిజన్ ఇరిగేషన్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా నెరవేర లేదు. జిల్లా పరిషత్ ఫండ్స్ హత్నూర మండలానికి కేటాయించకపోవడంతో డెవలప్మెంట్ ఆగిపోయింది.

మండలం నుంచి వివిధ గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రోడ్లకు మరమ్మతు లేక అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇదే మండల పరిధిలోకి వచ్చే కాసాల, దౌల్తాబాద్ గ్రామాల మధ్య కొన్నేళ్లుగా ఆధిపత్య కొనసాగుతోంది. కాసాల పరిధిలో ఉండే వివిధ సొసైటీ ఆఫీసులు దౌల్తాబాద్ పేరుతో చెలామణి అవుతున్నాయి.

ఆఖరుకు కాసాల పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ కు సైతం దౌల్తాబాద్ బస్టాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి మండలాన్ని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి విడదీయాలని ప్రజలు కోరుతున్నారు.