టెన్షన్​తో తెగ తింటున్నరు

టెన్షన్​తో తెగ తింటున్నరు

ఈటింగ్ డిజార్డర్​లో హైదరాబాద్​కు నాలుగో ర్యాంక్
ప్రాక్టో సంస్థ నేషనల్ మెంటల్ హెల్త్ సర్వేలో వెల్లడి 
నగరంలో10 శాతం మందిలో ఇదే సమస్య 

హైదరాబాద్, వెలుగు : మానసిక ఒత్తిడి, ఆందోళనతో హైదరాబాదీలు తిండి తెగ తింటున్నారు. లైఫ్ స్టైల్​లో మార్పు, పని ఒత్తిడి, కరోనా తర్వాత తలెత్తిన పరిస్థితుల వల్ల జనం విపరీతమైన మెంటల్ టెన్షన్​కు గురవుతున్నారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగా కొందరు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లలో కొందరు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తమను తామే వివిధ రూపాల్లో హింసించుకుంటున్నారు. టెన్షన్ అదుపులో పెట్టుకునేందుకో లేదా టెన్షన్ కారణంగా విడుదలయ్యే హార్మోన్ల కారణంగానో మరికొందరు అతిగా తినేస్తున్నారని ఈ మేరకు దేశవ్యాప్తంగా ‘మెంటల్ హెల్త్ సర్వే’ నిర్వహించిన ప్రాక్టో హెల్త్ కేర్ కంపెనీ తేల్చింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. అతిగా తినే అలవాటును కూడా ఇప్పుడు డిజార్డర్​గానే డాక్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో దేశంలో ఈటింగ్ డిజార్డర్​లో ఢిల్లీ మొదటి స్థానంలో(23%), బెంగుళూరు రెండు(19%), ముంబై మూడు(13%) ఉంటే హైదరాబాద్10 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే అతిగా తినే అలవాటు న్న వాళ్ల సంఖ్య 42 శాతానికి పెరిగిందని సర్వేలో పేర్కొన్నారు.   

కరోనా తర్వాతా కల్లోలం  

కరోనా తర్వాత ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రాక్టో సంస్థ దేశంలోని ప్రధాన నగరాల్లో కొందరిని వివిధ ప్రశ్నలతో సమాధానాలు సేకరించింది. జనాల మానసిక పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు, వారిలోని ఆందోళన స్థాయి, ఆహారపు అలవాట్ల గురించి అడిగింది. దాన్నుంచి డేటాను విశ్లేషించి వారి మానసిక స్థితిపై అంచనాకు వచ్చింది. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయం పడిపోవడం, కుటుంబాలు ఇబ్బందులకు లోనుకావడం, కరోనా పోయి సాధారణ పరిస్థితులు వచ్చాక తిరిగి నార్మల్ లైఫ్ కొనసాగించేటప్పుడు చాలా మంది రకరకాల ఒత్తిడులకు లోనవుతూ వస్తున్నారు. దీని కారణంగా జనంలో సూసైడల్ టెండెన్సీ బాగా పెరిగిందని సర్వేలో గుర్తించారు. అదే సమయంలో సమస్య నుంచి బయట పడాలనుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగిందని తేలింది. చాలా మంది  కౌన్సెలింగ్ సెంటర్లకు, టోల్ ఫ్రీ కౌన్సెలింగ్​కు, సైకాలజిస్టులకు ఫోన్ చేసి సమస్యలు చెప్పుకుంటున్నట్లు వెల్లడైంది. 

కార్టిసాల్ హార్మోన్ వల్లే.. 

మెంటల్ డిజార్డర్​కి గురవుతూ అతిగా తిండికి అలవాటు పడుతున్న వాళ్లలో16 నుంచి 82 ఏండ్ల వయసు వరకు ఉన్నారు. కానీ16‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–34 ఏండ్ల మధ్య వాళ్లే ఎక్కువగా ఈ సమస్య బారిన పడ్తున్నారు. మూడ్​ బాగా లేకపోయినా, ఏదైనా ఒత్తిడికి గురైనా, బాధలో ఉన్నా చాలా మంది అవసరానికి మించి తినేస్తుంటారు. దీన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ స్థితి దీర్ఘకాలంగా కొనసాగితే సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడికి లోనైనప్పుడు కార్టిసాల్ హార్మోన్​ఎక్కువగా విడుదలవుతుందని, దాంతో ఆకలి ఎక్కువైనట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా ఉద్వేగానికి లోనయినప్పుడు చాలా మంది ఏదో ఒకటి తినడం వల్ల భావావేశాలను అదుపులో పెట్టుకోగలమని భావిస్తూ ఉంటారని డాక్టర్లు అంటున్నారు. 

పోస్ట్ ట్రామాటిక్ డిజార్టర్​లో 6వ స్థానం  

కరోనా, ఇతర ఆరోగ్య సమస్యల తర్వాత వచ్చే  సమస్యలను పోస్ట్ ట్రామాటిక్ స్ర్టెస్ డిజార్డర్ అంటాం. ఇందులో హైదరాబాద్ ఆరో స్థానంలో (5%), ఢిల్లీ (23%) మొదటి స్థానంలో ఉండగా తర్వాత ముంబై(18 %), బెంగుళూరు(17%), పుణె (7%), చెన్నై (6%) ఉన్నాయని మెంటల్ హెల్త్​సర్వే తేల్చింది. డ్రగ్స్​ వాడుతున్న వారిలో ఆందోళన, నిరాశలో ఉన్నవారిలో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది. 

కౌన్సెలింగ్​కూ ఆసక్తి చూపుతున్రు 

సిటీలో జనంలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు దాన్నుంచి బయటపడాలనే తపన ఉన్న వాళ్ల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. దేశ జనాభాలో 14% తమ సమస్య పరిష్కారానికి వేరే వాళ్ల జోక్యం అవసరమని భావిస్తున్నారు. సమస్య నుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యులను, డాక్టర్లను, కౌన్సెలింగ్ సెంటర్లను, టోల్ ఫ్రీ నంబర్లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో కూడా 25 నుంచి 34 ఏళ్ల వయసున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారని సర్వేలో తేలింది. సర్వే శాంపిళ్లలో 61 శాతం మగవాళ్లు, 39 శాతం ఆడవాళ్లు ఉన్నారని ప్రాక్టో సంస్థ తెలిపింది.

ఆలోచించకుండా తినేస్తారు 

స్ట్రెస్, డిప్రెషన్​తో బాధపడుతున్న వాళ్ల కేసులు 20 నుంచి 30 శాతం పెరిగాయి. చాలా మంది స్ట్రెస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు దాన్ని బీట్ చేసేది ఫుడ్ అని భావిస్తుంటారు. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా హైక్యాలరీలు ఉన్న ఫుడ్ తినేస్తారు. ఇలా ఇష్టమొచ్చినట్లుగా తినడా న్ని డింజ్ఈటింగ్ అంటాం. ఈ మధ్యకాలంలో ఈ రకమైన హ్యాబిట్ జనాల్లో పెరుగుతున్నది. 

- డాక్టర్​ మెజర్ అలీ, కేర్ హాస్పిటల్స్