రష్యా సేనలు ఖేర్సన్ వదిలి వెళ్లడంతో స్వేచ్ఛగా ఉంటున్నం

రష్యా సేనలు ఖేర్సన్ వదిలి వెళ్లడంతో స్వేచ్ఛగా ఉంటున్నం

ఖేర్సన్: ఉక్రెయిన్​లోని దక్షిణ ప్రాంతమైన ఖేర్సన్ ప్రజలు ఇప్పుడిపుడే స్వేచ్ఛగా బయటకు రావడం ప్రారంభించారు. సరిగ్గా వారం కిందట ఖేర్సన్ ప్రాంతాన్ని రష్యా సేనలు వదిలివెళ్లాయి. అప్పటిదాకా ఆ ప్రాంత వాసులు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు అన్నీఇన్నీ కావు. రష్యా బలగాలు ఆ ప్రాంతంలో ఉన్నంత కాలం దుర్భర జీవితం అనుభవించామని ఖేర్సన్ ప్రజలు తెలిపారు. ‘‘ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ చేసిన కొద్ది రోజుల తర్వాత ఖేర్సన్ ప్రాంతాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి. రాత్రీపగలు అనే తేడా లేకుండా బాంబుల మోతలు, మిసైళ్ల దాడులు నిత్యకృత్యమయ్యాయి. దీంతో కొన్ని లక్షల మంది ఖేర్సన్ ను వదిలివెళ్లారు. దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. నీరు, కరెంటు కొరత ప్రారంభమైంది. 30 లక్షలు ఉన్న ఖేర్సన్ సిటీ జనాభా 80 వేలకు పడిపోయింది” అని ఒలెనా మోలియానా అనే ఫార్మసిస్ట్ తెలిపారు.

రష్యా బలగాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత తమను దారుణంగా అణచివేశారని ఆమె చెప్పారు. ఇప్పుడిదంతా గతం అని, రష్యా బలగాలు ఖేర్సన్ నుంచి వెళ్లిపోయాక చాలా మంది వీధుల్లోకి వస్తున్నారని, ప్రాణభయంతో సిటీ నుంచి వెళ్లిపోయిన వారు కూడా తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారని వెల్లడించారు. ప్రస్తుతం తామంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. రష్యా బలగాలు తమ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నపుడు తాము ఒక పంజరంలో ఉన్నట్లు ఉండేదని, స్వేచ్ఛగా మాట్లాడలేని, తిరగలేని పరిస్థితి ఉండేదని ఒలెక్సాండర్ అనే పౌరుడు గుర్తుచేసుకున్నాడు.