ఇంకా భయాందోళనలోనే నల్లగుట్టవాసులు

ఇంకా భయాందోళనలోనే నల్లగుట్టవాసులు
  • బస్తీలో నాలుగు చోట్ల మెడికల్​ క్యాంప్​లు

సికింద్రాబాద్, వెలుగు: నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్​ మాల్​లో అగ్ని ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా స్థానికులు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. ప్రమాదం జరిగిన రోజు ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లినవారిలో చాలా మంది ఇంకా తమ ఫ్లాట్లకు తిరిగి రాలేదు. కొంత మంది సిటీలోని తమ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లకు వెళ్లగా మరికొందరు సొంతూళ్లకు వెళ్లారు. కాగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శనివారం బస్తీలోని నాలుగు ప్రాంతాత్లో మెడికల్ క్యాంప్​లు ఏర్పాటు చేశారు. బస్తీలోని చాలా మంది శ్వాస సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి మందులు అందజేస్తున్నట్లు వైద్య బృందాలు వెల్లడించాయి. బస్తీలో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం తర్వాత గ్యాస్ సిలిండర్లు వాడొద్దని బస్తీ వాసులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో వారు వంటలు చేసుకోలేకపోతున్నారు. దీంతో స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు వారికి ఫుడ్​ను అందిస్తున్నాయి.

బాధితులను ఆదుకోవాలి: ప్రొఫెసర్ కోదండరాం

అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీజేఎస్‌‌ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఘటనా స్థలాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించి నల్లగుట్టలోని బస్తీ వాసులతో మాట్లాడారు. ప్రమాదం కారణంగా బిల్డింగ్‌‌కి చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయ
న్నారు. స్థానిక బస్తీవాసులను ఆ ఇండ్ల నుంచి ఖాళీ చేయించడంతో నిరాశ్రయులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు, ధ్వంసమైన స్థానికుల ఇండ్లకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలకు తక్కువ కాకుండా ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. భవిష్యత్‌‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాద స్థలాన్ని సీపీఐ నాయకులు సందర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని జిల్లా కార్యదర్శి నర్సింహా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.