
- హత్యాయత్నం సహా నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు
- ఎస్‌వోటీ పోలీసులపై దాడి చేశారని ఇంకో కేసు
- మల్లన్నతోపాటు మరో నలుగురు క్యూ న్యూస్ సిబ్బంది అరెస్టు
- 14 రోజుల రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్.. చర్లపల్లి జైలుకు తరలింపు
హైదరాబాద్/ మేడిపల్లి/ ఎల్బీ నగర్, వెలుగు: క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి చేసిన వ్యక్తి ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నతోపాటు మరో నలుగురు క్యూ న్యూస్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం సహా ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ఎస్‌వోటీ పోలీసులపై మల్లన్న టీమ్ దాడి చేసిందని, కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసేందుకు యత్నించిందని కూడా మరో కేసు పెట్టారు. బుధవారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తీన్మార్ మల్లన్నతోపాటు బండారు రవీందర్, ఉప్పల నిఖిల్, సిర్రా సుధాకర్, చింత సందీప్ కుమార్ అనే నలుగురు క్యూ న్యూస్ సిబ్బందికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు
క్యూన్యూస్ ఆఫీస్‌పై దాడి చేసినవాళ్లను కాకుండా ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన అభిమానులు, ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. మల్లన్నకు మద్దతుగా ఆందోళనకు దిగారు.
బీఆర్ఎస్ కార్యకర్త సాయి కిరణ్ ఫిర్యాదుతో..
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీస్‌పై ఆదివారం 25 మంది కట్టెలు, రాడ్లతో దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దాడిలో పాల్గొన్న బీఆర్‌ఎస్ కార్యకర్త సాయికిరణ్ గౌడ్‌ను స్థానికులు పట్టుకొని.. క్యూ న్యూస్ ఆఫీస్‌లో బంధించారు. మేడిపల్లి పోలీసులు సాయికిరణ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి చేసిన సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 19న తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురు క్యూ న్యూస్ సిబ్బందిపై హత్యాయత్నం సహా ఇతర నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనను క్యూ న్యూస్ సిబ్బంది నిర్బంధించి, దాడి చేశారని ఫిర్యాదులో సాయికిరణ్ పేర్కొన్నాడు.
ఎస్‌వోటీ కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేశారనీ!
వరుస చైన్ స్నాచింగ్స్ నేపథ్యంలో పీర్జాదిగూడ రాఘవేంద్రనగర్‌లో ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు కొన్నాళ్లుగా వెహికల్ చెక్ చేస్తున్నారని, అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చి ఎస్‌వోటీ పోలీసులను ప్రశ్నించారని, ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్‌వోటీ కానిస్టేబుల్ భానును కిడ్నాప్ చేసి దగ్గర్లోని క్యూన్యూస్ ఆఫీస్‌లో నిర్బంధించారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురు సిబ్బంది అతి దారుణంగా దాడి చేసి, హత్యాయత్నం చేశారని అందులో ఆరోపించారు. కానిస్టేబుల్ భాను కంప్లైంట్‌తో మల్లన్నతోపాటు నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మల్లన్నపై 92 కేసులు!
మల్లన్నపై ఇప్పటికే 90కి పైగా కేసులు నమోదయ్యాయని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసలు పేర్కొన్నారు. సాయికిరణ్‌గౌడ్ కేసుతో పాటు ఎస్‌వోటీ పోలీసులపై దాడి కేసులో మల్లన్న టీమ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మొత్తం 92 కేసులు మల్లన్నపై ఉన్నాయన్నారు. వరుస కేసుల్లో నిందితుడు కావడంతో ఆయనపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది.
14 రోజుల రిమాండ్
నాటకీయ పరిణామాల నడుమ మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్నను మెజిస్టేట్ ముందు ప్రవేశపెట్టారు. హయత్ నగర్ మునగనూరులోని మేడ్చల్ మల్కాజ్ గిరి మెజిస్టేట్ ముందు బుధవారం తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురిని పోలీసులు హాజరుపర్చారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. తీన్మార్ మల్లన్నతో పాటు మిగతా నలుగురిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు.
క్యూ న్యూస్‌పై దాడి పూర్తి ఆధారాలు లభించలే: ఇన్‌స్పెక్టర్
‘‘క్యూ న్యూస్‌పై దాడి జరిగిన ఘటనలో ఇంకా కేసు నమోదు చేయలేదు. విచారణ జరుపుతున్నం. ఇంకా పూర్తి ఆధారాలు లభించలేదు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటం’’ అని మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ -గోవర్ధన్‌గిరి చెప్పారు.
సర్కారు నియంతృత్వ ధోరణికి నిదర్శనం: అద్దంకి దయాకర్
‘‘రాష్ట్ర సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్నపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడం నియంతృత్వ ధోరణే” అని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి చేసిన వ్యక్తులను స్థానికులు పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించగా పోలీసులు మాత్రం దాడి చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ చేయకపోగా ఆ వ్యక్తి ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నపై, క్యూ న్యూస్ సిబ్బందిపై కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసుల నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించే మీడియాకు భయపడి సమాధానం చెప్పలేక అణచివేసే ధోరణిని బీఆర్ఎస్ సర్కార్ అవలంబిస్తున్నదన్నారు. మల్లన్న అరెస్టు విషయం తెలుసుకున్న ఆయన పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి మల్లన్న నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. మల్లన్న కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వీ6, వెలుగుపై పోలీసుల ఓవర్ యాక్షన్
తీన్మార్ మల్లన్నను పోలీసులు హయత్ నగర్ మునుగనూర్ లోని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరు పరుస్తున్నారన్న సమాచారంతో అక్కడికి కవరేజ్ కోసం వెళ్లిన వీ6, వెలుగు టీమ్‌పై పోలీసులు ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు. వీ6 కెమెరా చిప్ ను అక్కడే ఉన్న ఓ ఏసీపీ గుంజుకున్నాడు. కవర్ చేయొద్దని, వెళ్లిపోవాలని హెచ్చరించాడు.
అక్రమ కేసులు పెడుతున్నరు: మల్లన్న భార్య
తన భర్త మల్లన్న జాడ చెప్పాలని అడిగితే పోలీస్ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారని తీన్మార్ మల్లన్న భార్య మమత ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్నను అరెస్టు చేశారని తెలిసి బుధవారం ఉదయం 10 గంటలకు ఆమె తన ఇద్దరు కూతుళ్లు, కుటుంబ సభ్యులు, అడ్వకేట్‌తో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మేడిపల్లి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్.. తీన్మార్ మల్లన్న ఇక్కడ లేరని, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పి అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్తే.. తమ దగ్గర లేరని అక్కడి పోలీసులు అన్నారని మమత ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నన్ను తిప్పుతున్నరు. నా భర్తను చూపించాలంటే చూపిస్తలేరు” అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్రమ కేసులు పెట్టి తన భర్తను అరెస్టు చేశారని అన్నారు.