కీలక మలుపులు తిరుగుతున్న సోనాల్ ఫోగట్ మృతి కేసు

కీలక మలుపులు తిరుగుతున్న సోనాల్ ఫోగట్ మృతి కేసు

ఛండీగఢ్‌ : బీజేపీ నేత, నటి సోనాల్‌ ఫోగట్‌ మృతిపై పోలీసుల విచారణ అన్ని కోణాల్లో కొనసాగుతోంది. ఫోగట్ మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు.  గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘ‌ట‌న‌లో ఇద్దరిపై మ‌ర్డర్ కేసు న‌మోదైంది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు. సోనాల్‌ ఫోగట్‌ మృతిపై ఆమె సోదరుడు రింకు ధాక సంచలన ఆరోపణలు చేశాడు. సోనాల్ పై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశాడు. సోనాల్‌ ఫోగట్‌ పీఏ సుధీర్‌ సంగ్వాన్‌, అతని స్నేహితుడు సుఖ్విందర్‌లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చేవాళ్లని అన్నాడు. 

రింకు ఆరోపణల నేపథ్యంలో సోనాల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోనాల్‌ తన పీఏ సుధీర్ సంగ్వాన్‌, ఫ్రెండ్ సుఖ్వింద‌ర్ వాసితో సోనాల్‌ డ్యాన్స్ చేసింది. ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లిన ముగ్గురూ.. డ్యాన్స్ చేసిన‌ట్లు ఆ వీడియోలో ఉంది. వారందరూ ఎంతో ​క్లోజ్‌గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, పోస్టుమార్టమ్ రిపోర్ట్ ప్రకారం సోనాల్‌ శ‌రీరంపై బ‌ల‌మైన గాయాలు ఉన్నట్లు తేలిందని గోవా పోలీసులు చెప్పారు. గోవాలోని రిసార్ట్‌లో సోనాల్ ఆగ‌స్టు 22వ తేదీన మృతిచెందిన విషయం తెలిసిందే.