ఆదిలాబాద్/నిర్మల్, వెలుగు: ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీసులు నిబద్ధతతో పని చేయాలని, సర్పంచ్ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. గురువారం ఆదిలాబాద్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలతో సమావేశం నిర్వహించారు.
నిర్మ ల్ లోని ఎల్లాపల్లి వద్ద నిర్మించిన బిల్డింగ్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్ట్ లలో తనిఖీలు చేపట్టాలన్నారు. మతపరమైన, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ సిబ్బందిని వినియోగించాలని సూచించారు. పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎలాంటి చర్యలు ఉండవద్దన్నారు.
అనంతరం ఆదిలాబాద్ పట్టణంలో పోలీస్ గెస్ట్ హౌస్ పునఃనిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన వెంట మల్టీ జోన్ వన్ ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, పీఅండ్ఎల్ ఐజీ ఎం రమేశ్, ఎస్పీలు అఖిల్ మహాజన్, జానకి షర్మిల, నితికా పంత్, మంచిర్యాల్ ఏసీపీ ఎగ్గడి భాస్కర్, అదనపు ఎస్పీలు కాజల్ సింగ్, బి సురేందర్ రావు, ఏఎస్పీ చిత్తరంజన్, పి మౌనిక, డీఎస్పీలు వహీదుద్దీన్, వెంకటేశ్వర్, పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
