
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు వివరాలు, మెటీరియల్స్ ఎవరికీ ఇవ్వరాదని క్రిమినల్ లా చెబుతున్నదని, ఫిర్యాదుదారుడైన పైలెట్ రోహిత్‌రెడ్డికి ఇవ్వడం కూడా చట్ట వ్యతిరేకమని బీజేపీ హైకోర్టులో వాదించింది. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నామని చెప్పింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డి విచారణ జరిపారు. బీజేపీ తరఫున సీనియర్ లాయర్ జె.ప్రభాకర్ వాదించారు. దర్యాప్తునకు ముందే కేసు వివరాలను సీఎం మీడియాకు విడుదల చేశారని, ఫిర్యాదుదారు పైలెట్ రోహిత్‌రెడ్డి ద్వారా సీఎంకు చేరి ఉండొచ్చని అదనపు ఏజీ జె.రామచందర్ రావు గత వాదనల్లో చెప్పారని గుర్తు చేశారు. ఎవరి ద్వారా వివరాలు బయటికెళ్లినా.. అది కేసు దర్యాప్తుపై ప్రభావం ఉంటుందన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనను ప్రస్తావిస్తూ.. దర్యాప్తు అధికారులు సమాచారాన్ని ఫిర్యాదుదారుడికి కూడా ఇవ్వరాదన్నారు. సీఆర్‌పీసీలోని సెక్షన్లను పరిశీలిస్తే ఫిర్యాదుదారుకు కూడా కేసు వివరాలివ్వరాదని చెప్పారు. విచారణలో భాగంగా దర్యాప్తు అధికారి గోప్యతను పాటించడం లేదని రుజువైందన్నారు. సిట్ తరఫున సీనియర్ లాయర్ దుశ్యంత్ దవే వాదనల టైంలో కేసు వివరాల పెన్ డ్రైవ్, సీడీలను సీల్డ్ కవర్‌లో సీఎం.. ప్రధాన న్యాయమూర్తులకు పంపడంపై బేషరతుగా క్షమాపణలు చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చరాదన్నారు. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
41ఏ నోటీసులపై స్టే 22 దాకా పొడిగింపు
బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళ డాక్టర్ జగ్గు కొట్టిలిల్ (జగ్గుస్వామి), కరీంనగర్ లాయర్ భూసారపు శ్రీనివాస్‌లకు సిట్ ఇచ్చిన 41ఏ నోటీసులపై గతంలోని స్టేను హైకోర్టు 22వ తేదీ దాకా పొడిగించింది. ఈమేరకు జస్టిస్ కె.సురేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈనెల 22కి వాయిదా వేశారు. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై గతనెల 25న హైకోర్టు స్టే విధించింది. లుకౌట్ నోటీసుల అమలును కూడా నిలుపుదల చేసింది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ వాళ్లు దాఖలు చేసిన రిట్ల తరఫున వాదనలు కొనసాగాయి. బీఎల్ సంతోష్ తరఫున దేశాయ్ ప్రకాష్ రెడ్డి, జగ్గుస్వామి తరఫున వి.పట్టాభి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. బీఎల్ సంతోష్, తుషార్ వెల్లపల్లి, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చే మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ నిర్ణయాన్ని సిట్ హైకోర్టులో సవాల్ చేసిన రిట్‌పై మరో సింగిల్ జడ్జి ఎదుట గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. దీనిపై తీర్పును ఈనెల 21న వెలువడనున్న నేపథ్యంలో సిట్ నోటీసులపై కేసుల విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. అప్పటి దాకా స్టే ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్టేట్ మెంట్ రికార్డ్
ఎల్బీ నగర్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ను మంగళవారం రికార్డ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఐదో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సమక్షంలో సుమారు రెండు గంటల పాటు స్టేట్మెంట్ తీసుకున్నారు.