నల్గొండ వేదికగా  రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి

నల్గొండ వేదికగా  రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి
  • పోటాపోటీ చేరికలతో అయోమయంలో క్యాడర్​

నల్గొండ, వెలుగు: టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, స్టార్​క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆధిపత్య పోరుకు ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికలా మారింది. ఈ లీడర్లిద్దరూ తమ వర్గాలకు చెందిన నేతలను ఎవరికివారే పార్టీలో చేర్చుకుంటుండడంతో క్యాడర్​ పరేషాన్​ అవుతోంది. మొదట్లో పీసీసీ అధ్యక్ష పదవికి అటు రేవంత్​, ఇటు కోమటిరెడ్డి పోటీ పడగా, హైకమాండ్ ​రేవంత్​రెడ్డిని ఓకే చేసింది. అలిగిన కోమటి రెడ్డి గాంధీభవన్​లో అడుగుపెట్టనని ప్రతినబూనాడు. తర్వాత ఢిల్లీ పెద్దల బుజ్జగింపుతో కలిసిపనిచేస్తామని నేతలిద్దరూ ప్రకటించినా ఇటీవల నల్గొండ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు బట్టి విభేదాలు ఇంకా సమసిపోలేదని అర్థమవుతోంది.

గేమ్​ మొదలుపెట్టిన కోమటిరెడ్డి

రేవంత్​రెడ్డి ప్రమేయం లేకుండా ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వడ్డేపల్లి రవిని జూన్​ 26న పార్టీలో చేర్చుకున్నారు. 201 8 ఎన్నికల్లో రవికి ఎమ్మెల్యే టికెట్​ దక్కకపోవడంతో పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్​ పై రెబల్​గా పోటీ చేశాడు. ఓట్లు చీలిపోవడంతో దయాకర్​ ఓటమికి రవి పరోక్షంగా కారకుడయ్యాడు. దీనిని సీరియస్​గా తీసుకున్న హైకమాండ్​ రవిని ఆరేండ్ల పాటు సస్పెండ్​ చేసింది. ఈ సస్పెన్షన్​ రివోక్​ కాకముందే రవిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి రేవంత్​ ఒప్పుకోలేదు. పార్టీలో చేరడానికి ముందు, రేవంత్​ అపాయిట్​మెంట్​​ కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. పీసీసీ చీఫ్​ నిర్ణయానికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరె డ్డి వడ్డేపల్లి రవిని పార్టీలో చేర్చుకోవడాన్ని రాంరెడ్డి దామోదర్​ రెడ్డి, రేవంత్​వర్గీయుడైన అద్దంకి దయాకర్​ వ్యతిరేకించారు. 

గేమ్​కంటిన్యూ చేస్తున్న రేవంత్..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదలు పెట్టిన గేమ్​ను రేవంత్​ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా దేవరకొండ నియోజకవర్గంలో  వెంకట్​రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్​వర్గీయులు కాంగ్రెస్​లో చేరడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. రేవంత్​ టీడీపీ లో ఉన్నప్పుడు ఆయన వర్గంగా పనిచేసిన అప్పటి జిల్లా అధ్యక్షుడు బి ల్యానాయక్​ శుక్రవారం రేవంత్​ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. రేవంత్​తో పాటే కాంగ్రెస్​లో చేరిన బిల్యానాయక్​ 2018 ఎన్నికల్లో టికెట్​ ఆశించారు. కానీ హైకమాండ్​ ఆయనను కాదని మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్ కు​ టికెట్​ ఇచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో బిల్యా బీఎస్పీ నుంచి పోటీ చేయడంతో కాంగ్రెస్​ క్యాండేట్​ బాలూనాయక్​ ఓడిపోయారు. ప్రస్తుతం బాలూనాయక్​, మరో నేత కిషన్​ నాయక్​ఇద్దరూ కోమటిరెడ్డి వర్గంలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వీళ్లలో ఎవరో ఒకరికి టికెట్​ వస్తదనే నమ్మకంతో ఉన్నారు. కానీ అనూహ్యంగా బిల్యా నాయక్​ పార్టీలో చేరడంతో జిల్లా కాంగ్రెస్​లో కొత్త చిచ్చు పెట్టినట్లైంది. కాగా, తుంగతుర్తిలో వడ్డేపల్లి రవి చేరిక చెల్లదని ఇటీవల పీసీసీ ప్రకటించినట్లే  బిల్యానాయక్​చేరిక కూడా చెల్లదని ఎంపీ కోమటిరెడ్డి  ఆదివారం హైదరాబాద్​లో చేసిన కామెంట్లు పార్టీలో చర్చకు దారితీశాయి.

ఇది ఎంతవరకు?

అమెరికా టూర్​తో రేవంత్, కోమటిరెడ్డి మధ్య విభేదాలు సమసిపోయాయని పార్టీ హైకమాండ్​ భావించింది. కానీ కొద్ది రోజులకే తుంగతుర్తి, దేవరకొండ నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పరిణామాలు హైకమాండ్​కు తలనొప్పిగా మారాయి.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్​ తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తన అనుచరులతో వాపోతున్న  అగ్రనేతలు బయటకు మాత్రం సైలెంట్​గా ఉంటున్నారు. సీనియర్​ నేత జానారెడ్డి, ఉత్త మ్​ వంటి లీడర్లు ఇప్పటికీ నోరెత్తకపోవడం గమనార్హం.