కిలో చికెన్ రూ. 40 నుంచి 290కి

కిలో చికెన్ రూ. 40 నుంచి 290కి

హైదరాబాద్, వెలుగు: చికెన్ ధర రికార్డు సృష్టించింది. ఆదివారం మార్కెట్ లో కిలో చికెన్ ధర రూ.290 పలికింది. దాదాపు ఐదేండ్ల తర్వాత చికెన్ ధర ఈ స్థాయికి చేరింది. ధరలను చూసి చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ తినే పరిస్థితి లేదని వాపోతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని 60 శాతానికి తగ్గించడం, రంజాన్ నెల కావడంతో వినియోగం పెరగడం… ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని చెబుతున్నారు.

అప్పుడు ఇట్లనే…

ఐదేండ్ల క్రితం బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ రంగం కుదేలైంది. అప్పట్లోనూ కొన్నాళ్లు చికెన్ తినేందుకు జనం ముందుకు రాలేదు. ఆ తర్వాత వినియోగం అమాంతం పెరిగింది. 2015 వేసవిలో కిలో చికెన్​రూ.294 వరకు పలికింది. ఇప్పుడు కరోనా కారణంగా మొదట్లో జనం చికెన్ కు దూరంగా ఉన్నారు. దీంతో చికెన్ కిలో రూ.30కి పడిపోయింది. ఆ తర్వాత చికెన్ తో కరోనా రాదని, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పడంతో వినియోగం పెరిగింది. ఇప్పుడందరూ మస్తుగా చికెన్ తింటున్నారు. వినియోగం పెరగడం, కరోనా ఎఫెక్ట్ మరికొన్ని నెలల పాటు ఉంటుందని రైతులు కోళ్లను పెంచకపోవడంతో ధరలు భారీగా పెరిగాయి.

మటన్ కు ఫిక్స్ రేటు

ఈ నెల మొదటి వారంలో మటన్​కు ఎక్కువగా గిరాకీ ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచేశారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.వెయ్యికి కిలో అమ్మారు. ధరలను రోజురోజుకు పెంచుతుండడంతో ప్రభుత్వం మటన్​కు రేటు ఫిక్స్​చేసింది. కిలో రూ.700లకు మించి అమ్మవద్దని, ఎవరైనా అలా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పశుసంవర్థక శాఖ అధికారులను రంగంలోకి దింపి అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేయించింది. దీంతో మటన్ ప్రియులకు మాంసం ఫిక్స్​రేటుకే లభిస్తోంది.

చికెన్‌కూ ప్రభుత్వం రేటు ఫిక్స్ చేయాలి

హైదరాబాద్ లో మార్చి చివరి వారంలో కిలో చికెన్ రూ.40కి ఇచ్చిన కొనేటోళ్లే లేకుండే. కొన్నిచోట్ల ఫ్రీగా కూడా పంచిన్రు. చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడంతో.. ఆ తర్వాత నుంచి వినియోగం పెరిగింది. అయినప్పటికీ ఏప్రిల్ లో కిలో చికెన్ ధర రూ.120 నుంచి రూ.150 మించలేదు. కానీ ప్రస్తుతం ఆ ధర డబుల్​అయిపోయింది. ధరలు ఒకేసారి పెంచడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇమ్యునిటీ పెంచుకునేందుకు చికెన్ తింటుంటే, కరోనా పేరుతో దోచుకుంటారా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మటన్ లాగే చికెన్ కు కూడా ప్రభుత్వం రేటు ఫిక్స్ చేయాలని కోరుతున్నారు.

అరకిలనే తీసుకున్న…

వారానికి 4 రోజులు చికెన్ ​తింటా. కానీ ఐదు రోజులుగా కిలో రూ.250కి పైగా ఉంటోంది. నిన్న ఏకంగా రూ.290 చేరింది. ఎప్పుడు కిలో తీసుకునేటోన్ని.. ఈసారి అరకిలనే తీసుకున్నాను.- చిన్నా సుదర్శన్,​ కొనుగోలుదారుడు

సప్లై లేదు…

ఇంతకుముందు చికెన్​కు పెద్దగా డిమాండ్​లేకుండే. కానీ ఇప్పడు వినియోగదారులు పెరిగిన్రు. కానీ డిమాండ్ కు సరిపడా సప్లై లేదు. కోళ్ల పెంపకం తగ్గడంతోనే ధరలు పెరిగినయి. మరి కొద్ది రోజులు ఇలాగే ఉంటుంది. ఐదేండ్ల కిందట ఈ ధరలు ఉండే.- నందకిషోర్, చికెన్​వ్యాపారి

లాక్ డౌన్ 4 గైడ్ లైన్స్ ప్రకటించిన కేంద్రం