తెలియటం లేదు కానీ.. పాల ధర అంత పెరిగిందా..!

తెలియటం లేదు కానీ.. పాల ధర అంత పెరిగిందా..!

టమాటాల ధరలే కాదండోయ్.. ఇప్పుడు వరుసగా అన్ని ధరలు పెరుగుతున్నాయి. ఉప్పు, పప్పు దగ్గర నుంచి పాల వరకూ అన్ని రేట్లు భగ్గుమంటున్నాయి. సామాన్యుడు ఏదీ కొనేటట్టు లేదు. ఏమీ తినేటట్టు లేదు. ప్రస్తుతం అన్ని ధరలు భారీగానే పెరుగుతున్నాయి. 

ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది. కొంతకాలంగా టమాటా, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు పాల ధర కూడా భారీగా పెరిగింది. 

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం... గత ఏడాది పాల ధర 10 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో టోన్డ్ మిల్క్ ధరలు 9 శాతం ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

మంత్రి రూపాలా పార్లమెంటు ఎగువ సభలో ఎన్‌డిడిబి డేటాను వెల్లడించారు. గత మూడేళ్లలో పాల ధరలు పెద్దగా పెరగలేదని చెప్పారు. జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి అందిన సమాచారం ప్రకారం గత మూడేళ్లుగా పాల ధరలు పెద్దగా పెరగలేదన్నారు.

జూన్ 2022లో టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ. 47.4 ఇప్పుడు టోన్డ్ మిల్క్ లీటరు రూ.51.6గా మారింది. ఇలా టోన్డ్ మిల్క్ ధరలు ఏడాదిలో 8.86 శాతం పెరిగాయి. మరోవైపు, ఫుల్ క్రీమ్ మిల్క్ విషయానికొస్తే జూన్ 2022లో లీటరుకు రూ.58.8గా ఉన్న ధరతో పోలిస్తే లీటరుకు 9.86 శాతం పెరిగి రూ.64.6కి చేరుకుంది. దేశంలో పాల ధరలను పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ నియంత్రించడం లేదని మంత్రి పార్లమెంటుకు తెలిపారు. దేశంలో పాల కొనుగోలు, అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణ లేదని చెప్పారు.