ఈ ఉప్పు ధర కిలో రూ. 30 వేలు

V6 Velugu Posted on Jun 23, 2021

మీ ఇంట్లో ఉప్పు ఉందా? హా..ఉంది. దాని రేటు ఎంత?? కిలో ఓ పదో ఇరవయ్యో ఉంటది. అయినా ఇప్పుడెందుకు ఇవన్నీ అంటారా! ఇందులోనే ఉంది మరి  అసలు కథ. మామూలుగా ఏ బ్రాండ్​ ఉప్పైనా  పది.. ఇరవై మించదు. కానీ, ఓ కొరియన్​ ఉప్పు ధర  రూ.29392 ఉంది. అలాగని ఏ వందల కిలోలకో కాదు జస్ట్​ కిలో ఉప్పు రేటు ఇది. అంతలా ఏముంది ఈ ఉప్పులో! తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఉప్పు  పేరు ‘బ్యాంబో’. పర్పుల్​ సాల్ట్​ అని కూడా పేరుంది దీనికి. కొరియన్​లో అత్యంత పురాతనమైన ఉప్పుల్లో ఇదీ ఒకటి. అక్కడ ప్రతి ఒక్కరి వంటగదిలో ఈ ఉప్పు  ఉండాల్సిందే.  వారి ట్రెడిషనల్​ మందుల్లోనూ ఈ ఉప్పునే వాడతారు కొరియన్లు. అయితే గ్లోబల్​ వైడ్​ ఈ  ఉప్పుకి స్పెషల్​ గుర్తింపు రావడానికి కారణం దీని తయారీ.. ఇది తినడం వల్ల కలిగే లాభాలే. 
ఇలా తయారుచేస్తారు
సీ సాల్ట్​ని బ్యాంబూ బొంగుల్లో   వేడి చేసి ఈ సాల్ట్​ని తయారుచేస్తారు. ఈ ప్రాసెస్​ మొత్తానికి 40 నుంచి 45 రోజులు పడుతుంది. దాదాపు ఎనిమిది సార్లు 800 డిగ్రీల సెల్సియస్​లో ఈ బ్యాంబూ బొంగులని హీట్​ చేయాలి. చివరిసారి 1,000 డిగ్రీల సెల్సియస్‌‌లో వేడి చేయాలి. దీనివల్ల సముద్రపు ఉప్పుకి  వెదురులోని మినరల్స్​ అన్నీ అందుతాయి. పదేపదే వేడిచేయడం వల్ల సాలిడ్​ రాక్​ ఆకారంలోకి సముద్రపు ఉప్పు మారుతుంది. దాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి తర్వాత వంటలు, మెడిసిన్​లో వాడతారు. ఈ మొత్తం ప్రాసెస్​కి కూలీలు ఎక్కువగా అవసరం అవుతారు. దాంతో తయారీ ఖర్చు పెరుగుతోంది. పైగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఉప్పులో. అందుకే కిలో 29392 రూపాయలకి అమ్ముతున్నారు. 
లాభాలేంటంటే.. 
బ్యాంబో సాల్ట్​ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  దంతాలు, చర్మ  ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో యాంటీ ఇన్‌‌ఫ్లమేటరీ , యాంటీ క్యాన్సర్​ గుణాలు​ ఎక్కువ. రెగ్యులర్​గా మనం వాడే ఉప్పులతో పోలిస్తే బ్యాంబో సాల్ట్​లో ఐరన్​, పొటాషియం, క్యాల్షియం కూడా ఎక్కువ. ఇవి శరీరంలో ఇమ్యూనిటీ, మెటబాలిజంని పెంచుతాయి. ఇన్ని లాభాలుండటం వల్లే ఖర్చు ఎక్కువైనా ఎగబడి కొంటున్నారు కొరియన్లు. అన్నట్టు మనదగ్గరా కొన్ని సూపర్​ మార్కెట్స్​లో ఈ ఉప్పు అందుబాటులో ఉంది. 

Tagged Salt, High price,

Latest Videos

Subscribe Now

More News