ఎక్కడి సమస్యలు అక్కడే.. పట్టించుకోని రాష్ట్ర సర్కారు

ఎక్కడి సమస్యలు అక్కడే.. పట్టించుకోని రాష్ట్ర సర్కారు
  • గత ఏడాది 30 శాతం క్వార్టర్లీ ట్యాక్స్ పెంపు
  • సింగిల్ పర్మిట్‌‌‌‌కు ఏపీ అనుకూలంగా ఉన్నా స్పందిస్తలే
  • అక్రమ వసూళ్లతో వేధిస్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 9 ఏండ్ల నుంచి లారీ ఓనర్ల సమస్యలు పరిష్కారం కావడం లేదు. చర్చలు జరుపుతూ.. త్వరలో పరిష్కరిస్తామని చెబుతూ.. పట్టించుకోకుండా సర్కారు కాలయాపన చేస్తున్నది. దీంతో లారీ ఓనర్లు, ఆ రంగంపై ఆధారపడుతున్న వేలాది మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం 30 శాతం క్వార్టర్లీ రోడ్ ట్యాక్స్ పెంచటంతో ఓనర్లు ఇక్కట్లు మరింత పెరిగాయి. గతంలో రూ.10 వేలు ఉండగా.. రూ.14 వేలకు పెంచింది. రూ.200 ఉన్న గ్రీన్ ట్యాక్స్‌‌‌‌ను భారీగా  పెంచింది. అధికారుల అక్రమ వసూళ్లు, వేధింపులు, ఫైనాన్స్ వేధింపులతో గత 9 ఏండ్లలో 30 మంది లారీ యజమానులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లారీలను నడుపుకోలేక మరికొందరు వాటిని అమ్మేసుకుంటున్నారు. 

సింగిల్ పర్మిట్ సమస్య పరిష్కారం కాలే

ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల లారీలు ఉండగా, వీటిలో సుమారు 70 వేలకు పైగా ఇసుక మీదనే ఆధారపడి నడుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సింగిల్ పర్మిట్ విషయంలో లారీల యజమానులు ఇబ్బంది పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప సమస్యను పరిష్కరించడం లేదు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం, అక్కడి ట్రాన్స్ పోర్ట్ అధికారులు సానుకూలంగా ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదని లారీ ఓనర్స్ చెబుతున్నారు. సింగిల్ పర్మిట్ విధానం అమల్లోకి వస్తే ఏడాదికి రూ.5 వేలు కడితే రెండు రాష్ట్రాలకు లారీలు తిరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏపీకి వెళ్తే ఒక్క ట్రిప్ కే రూ.3 వేలు చెల్లించాల్సిన పరిస్థితి. సింగిల్ పర్మిట్ విధానం అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నదని, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందని ఓనర్లు వాపోతున్నారు.

ప్రభుత్వ శాఖల దోపిడీ

రాష్ట్రంలో ఇసుక లోడింగ్ టైమ్‌‌‌‌లో లారీ ఓనర్స్ డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ తీసిన తర్వాత వివిధ కారణాలు చెబుతూ అధికారులు దోచుకుంటున్నారని లారీల యజమానులు వాపోతున్నారు. ఒక్క లారీ లోడుకు గ్రామ పంచాయతీ పన్నుతోపాటు టీఎస్ఎండీసీ అధికారులు, ఇతరులు కలిపి రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోడింగ్ తర్వాత రోడ్డు మీదకు రాగానే ఆర్టీఏ అధికారులు, చెక్ పోస్టుల దగ్గర పోలీసులు లారీలను ఆపుతూ ఓవర్ లోడింగ్ పేరుతో ఫైన్లు వేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఫీల్డ్​లో ఉండలేక, ఇబ్బందులతో సతమతమవుతూ లారీ యజమానులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 9 ఏండ్లలో 30 మంది లారీ యజమానులు ఆత్మహత్యలు చేసుకున్నారని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక ఈ ఫీల్డ్ ను వదిలేస్తున్నామని వాపోతున్నారు.

నాడు పిలిచి చర్చలు జరిపిన మంత్రులు

మునుగోడు బైపోల్ టైమ్​లో సమస్యలు పరిష్కరించకోపోతే 101 మంది నామినేషన్లు దాఖలు చేస్తామని లారీ ఓనర్స్ తేల్చి చెప్పారు. దీంతో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్.. సమస్యలు పరిష్కరిస్తామని, తొందరపడి నామినేషన్లు వేయొద్దని కోరారు. దీంతో లారీ ఓనర్స్ వెనక్కి తగ్గారు. కానీ బైపోల్ అయిపోయి 3 నెలలు కావస్తున్నా.. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని నేతలు అంటున్నారు.

హామీలను నిలబెట్టుకోవాలి

మునుగోడు టైమ్ లో నామినేషన్లు వేస్తామంటే.. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ హామీలు ఇచ్చారు. వాటిపై జీవోలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. సింగిల్ పర్మిట్ విధానం, టీఎస్ఎండీసీ కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లు, పోలీసులు, ట్రాన్స్ పోర్ట్ అధికారుల ఫైన్లు ఇలా ఎన్నో అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లినం. ఎండీసీ అధికారుల సమక్షంలో ఇసుక ఓవర్ లోడ్ వేస్తున్నరు. రోడ్ల మీదకు వచ్చాక ట్రాన్స్​పోర్ట్ అధికారులు, పోలీసులు లారీలకు ఫైన్లు వేస్తున్నారు.

- నందారెడ్డి, రాష్ట్ర లారీ ఓనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్