తెలంగాణలో నెత్తురు నేలపాలు!.. మూడేండ్లలో 6 వేల యూనిట్ల రక్తం మట్టిపాలు

తెలంగాణలో నెత్తురు నేలపాలు!..  మూడేండ్లలో 6 వేల యూనిట్ల రక్తం మట్టిపాలు
  • 56 వేల యూనిట్లు ఆర్డర్ చేస్తే... అందింది 44 వేల యూనిట్లే
  • ఎక్కువగా వేస్ట్ అవుతున్నది ప్లేట్‌‌‌‌‌‌‌‌లెట్స్, ప్లాస్మానే..
  • సగానికి పైగా ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ డేట్ దాటడమే కారణం
  • అవసరం లేకున్నా ఆర్డర్లు.. డాక్టర్ల ముందస్తు జాగ్రత్తతో తిప్పలు
  • రాష్ట్రంలోని 50 బ్లడ్ బ్యాంకుల్లో ఇండోర్ మెడికల్ కాలేజీ స్టడీ

హైదరాబాద్, వెలుగు: ‘రక్తదానం.. ప్రాణదానం’ అని జనం ముందుకొచ్చి బ్లడ్ ఇస్తుంటే.. అది ఆపదలో ఉన్నోళ్లకు అందకుండా పోతున్నది. బ్లడ్ బ్యాంకుల్లోనే మగ్గిపోయి.. చివరికి మట్టి పాలవుతున్నది. మన రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు, వినియోగంపై ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇండెక్స్ మెడికల్ కాలేజీ చేసిన స్టడీలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. గత మూడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 బ్లడ్ బ్యాంకుల్లో స్టడీ చేయగా.. బ్లడ్ వేస్టేజ్ ఏటికేడు పెరుగుతున్నట్టు తేలింది. 2022లో 11.7% ఉన్న బ్లడ్ వేస్టేజ్.. 2023 నాటికి 11.8, -2024లో ఏకంగా 13.3 శాతానికి పెరిగినట్టు వెల్లడైంది. ఈ మూడేండ్ల కాలంలో దాదాపు 6,274 యూనిట్ల రక్తం మట్టిపాలైందని తేలింది. ముఖ్యంగా 2024లోనే అత్యధికంగా 2,292 యూనిట్ల రక్తం వృథా కావడం ఆందోళన కలిగిస్తున్నది. 

రక్తం వృథా కావడానికి ప్రధాన కారణం ఎక్స్‌‌‌‌పైరీ డేట్ దాటిపోవడమేనని స్టడీలో తేలింది. వేస్ట్ అయిన దాంట్లో 58 శాతం యూనిట్లు కేవలం గడువు ముగిసిపోవడం వల్లే వృథా అయ్యాయి. ఎర్ర రక్త కణాలు (ఆర్డీసీ) 35- నుంచి 42 రోజులు నిల్వ ఉంటాయి. కాబట్టి వీటి వృథా (7.9%) తక్కువగానే ఉంది. కానీ డెంగ్యూ, క్యాన్సర్ పేషెంట్లకు వాడే ప్లేట్‌‌‌‌ లెట్స్‌‌‌‌కు ఎక్స్‌‌‌‌పైరీ డేట్ ఐదు రోజులే కావడంతో.. డిమాండ్ లేక అవి ఎక్కువగా (17%) వృథా అవుతున్నాయి. ఇక ప్లాస్మాను ఏడాది పాటు నిల్వ ఉంచవచ్చు. కానీ ఫ్రీజర్ నుంచి తీసి కరిగించాక 24 గంటల్లో వాడకపోతే పారేయాల్సిందే. ఇలా 16.9 శాతం ప్లాస్మా కూడా వృథా అవుతున్నది. మూడేండ్లలో ఏకంగా 2,312 యూనిట్ల ప్లాస్మా, 1,916 యూనిట్ల ప్లేట్‌‌‌‌లెట్స్, 2,046 యూనిట్ల ఎర్ర రక్త కణాలు వృథా అయ్యాయి.

12 వేల యూనిట్లు గ్యాప్.. 

మూడేండ్లలో రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో 56,482 యూనిట్ల రక్తం అవసరమని డాక్టర్లు ఇండెంట్ పెడితే.. చివరికి రోగుల ఒంట్లోకి ఎక్కింది మాత్రం 44,789 యూనిట్లే. స్టడీ ప్రకారం 56,482 యూనిట్ల రక్తం అవసరం పడితే.. బ్లడ్ బ్యాంకుల నుంచి 51,063 యూనిట్లు మాత్రమే హాస్పిటల్స్ కు సప్లై చేశారు. చివరగా పేషంట్లకు చేరింది మాత్రం 44,789 యూనిట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే అవసరానికి, అందుతున్న దానికి మధ్య దాదాపు 12 వేల యూనిట్ల గ్యాప్ కనిపిస్తున్నది. ఇందులో ఏకంగా 6,274 యూనిట్ల రక్తం అంటే.. 12.3 శాతం ఎందుకూ పనికిరాకుండా పోతున్నది. 

నిర్వహణలో ఫెయిల్​ .. 

బ్లడ్ గ్రూప్ లేబుల్ తప్పుగా అంటించడం, పేషెంట్ ఐడీ తప్పుగా రాయడం లాంటి చిన్న క్లరికల్ తప్పుల వల్ల కూడా విలువైన రక్తం వృథా అవుతున్నది. టెక్నాలజీ ఇంత పెరిగినా ఒక బ్లడ్ బ్యాంక్​లో మిగిలిపోతున్న రక్తాన్ని, కొరత ఉన్న మరో హాస్పిటల్​కు పంపించే నెట్​వర్క్ మన దగ్గర బలంగా లేదు. ఆన్​లైన్ డాష్​బోర్డులున్నా అవి అలంకారప్రాయంగానే మారాయి. ఇప్పటికైనా ఫస్ట్ ఇన్ -ఫస్ట్ అవుట్ పద్ధతిని పాటిస్తూ, బ్లడ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ పక్కాగా చేస్తేనే ఈ వృథాను అరికట్టగలమని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నో కారణాలు..

రక్తం వృథా కావడానికి గడువు ఒక్కటే కాదు.. మరెన్నో కారణాలు ఉన్నాయి. దాతల నుంచి తీసుకున్న రక్తంలో హెచ్ఐవీ, హెపటైటిస్, మలేరియా వంటి వైరస్‌‌‌‌లు ఉండటంతో 22.4 శాతం యూనిట్లను డిస్కార్డ్ చేయాల్సి వస్తున్నది. దాతల నుంచి రక్తం తీసుకునే ముందే సరైన కౌన్సెలింగ్ ఇవ్వకపోవడమే దీనికి కారణమని స్టడీ పేర్కొంది. ఇక బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం, నాణ్యత లేని బ్యాగుల వల్ల లీకేజీలు, పగిలిపోవడంతో 10 శాతం రక్తం నేలపాలవుతున్నది. వీటికి తోడు డాక్టర్ల తీరు కూడా వృథాకు కారణమవుతున్నట్లు రీసెర్చ్ స్పష్టం చేసింది. ఆపరేషన్ టైంలో పేషెంట్‌‌‌‌కు అవసరం పడుతుందేమోనని ముందస్తు జాగ్రత్తగా ఎక్కువ యూనిట్లు ఆర్డర్ పెడుతున్నారు. తీరా అవసరం లేక వెనక్కి పంపితే.. అవి రూమ్ టెంపరేచర్‌‌‌‌లో పాడైపోవడం వల్ల బ్లడ్ బ్యాంకులు తీసుకోవడం లేదు.