శ్రీలంకలో మొదలైన కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ

శ్రీలంకలో మొదలైన కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ

కొలంబో: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలైంది. తాత్కాలిక ప్రెసిడెంట్ రణిల్​ విక్రమసింఘే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాసతో పాటు నలుగురు లీడర్లు రేస్​లో ముందున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా నిరసనలు చెలరేగడంతో ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించేందుకు శనివారం పార్లమెంట్ సమావేశమైంది. విక్రమసింఘే, ప్రేమదాసతో పాటు మార్క్సిస్ట్ జేవీపీ నాయకుడు అనుర కుమార దిశనాయకే, ఎస్ఎల్పీపీ తిరుగుబాటు నాయకుడు డల్లాస్ అలహప్పెరుమా కూడా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు. జులై 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటింగ్​ నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి రాజపక్స మిగిలిన టర్మ్ అయిన 2024 నవంబర్​ వరకు పదవిలో కొనసాగుతారు. రాజపక్స రాజీనామాతో అధ్యక్ష పదవి ఖాళీ అయ్యిందని శనివారం 13 నిమిషాల పాటు మాత్రమే నిర్వహించిన పార్లమెంట్​ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. మంగళవారం వరకు అధ్యక్ష పదవికి దరఖాస్తులు తీసుకుంటామని, ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే బుధవారం ఓటింగ్​ నిర్వహిస్తామని పార్లమెంట్ సెక్రెటరీ జనరల్​ ధమ్మిక దాసనాయకే ప్రకటించారు.

సంక్షోభానికి కరోనానే కారణం: రాజపక్స
మాతృభూమి కోసం తన శక్తి మేరకు పని చేశానని, భవిష్యత్​లోనూ అదేపని చేస్తానని గోటబయ రాజపక్స పేర్కొన్నారు. సింగపూర్​నుంచి గోటబయ పంపించిన రాజీనామా లేఖను ధమ్మిక దాసనాయకే శనివారం పార్లమెంట్​లో చదివి వినిపించారు. అందులో తన చర్యలను రాజపక్స సమర్థించుకున్నారు. లంక ఆర్థిక సంక్షోభానికి కరోనా, లాక్​డౌన్లనే కారణంగా చూపించే ప్రయత్నం చేశారు.