కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్​ సమస్య.!

కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్​ సమస్య.!
  • 19 లక్షల అప్లికేషన్లకు మూడు దశల్లో ఎంక్వైరీ 
  • మీ సేవా అప్లికేషన్లకు మాత్రం స్పీడ్‌గా క్లియరెన్స్​ ​
  • వీటిలో 4 లక్షలకుగాను 1.57 లక్షల దరఖాస్తులకు అప్రూవల్ 
  • ఇవిగాక మార్పులు, చేర్పుల కోసం మరో 20 లక్షల అప్లికేషన్లు
  • వీటిల్లో ఇప్పటికే 15.93 లక్షల అప్లికేషన్లు క్లియర్ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కొత్త రేషన్​ కార్డుల జారీ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. గత పదేండ్లుగా కొత్త రేషన్ ​కార్డులు ఇవ్వకపోవడంతో ఏకంగా 19 లక్షల అప్లికేషన్లు రావడం, వాటిని మూడు దశల్లో ఎంక్వైరీ చేస్తుండడమే ఇందుకు కారణమని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఒక్కొక్కరు రెండు, మూడేసి అప్లికేషన్లు పెట్టడం వల్ల డూప్లికేషన్ ​సమస్యగా మారిందని అంటున్నారు. ఇదిగాక కార్డుల్లో పేర్ల మార్పులు, చేర్పుల కోసం గత పదేండ్లలో ఏకంగా 20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిని కూడా వెరిఫై చేసి ఇప్పటి వరకు 15,93,714 అప్లికేషన్లను క్లియర్ చేశామని అధికారులు చెప్తున్నారు.

ప్రజాపాలన, అధికారుల వద్ద అప్లై చేసుకున్న దరఖాస్తుల వెరిఫికేషన్​ ఆలస్యమవుతుండగా.. మీ సేవా ద్వారా వచ్చిన అప్లికేషన్లు మాత్రం త్వరగా క్లియర్​అవుతున్నాయి. ఇప్పటి వరకు మీ సేవా ద్వారా 4 లక్షల అప్లికేషన్లు రాగా, అందులో 1.57 లక్షల అప్లికేషన్లకు ఆమోదం లభించింది. మరో 2 లక్షల కార్డులను ఈ నెలాఖరు నాటికి మంజూరు చేస్తామని అధికారులు చెప్తున్నారు. వెరిఫికేషన్​పూర్తి చేసుకుని అప్రూవల్ వచ్చిన లబ్ధిదారులను ప్రతి నెలా 25వ తేదీ కల్లా కొత్త రేషన్​కోటాలో యాడ్​ చేసి, మరుసటి నెల నుంచి రేషన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.​ 

మూడు దశల్లో వెరిఫికేషన్

కొత్త రేషన్​కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల అప్లికేషన్లు రాగా, వీటిని మూడు దశల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుండగా, ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో మొదటి దశ దాటలేదు. డూప్లికేషన్​సమస్యే ఇందుకు ప్రధాన కారణమని ఆఫీసర్లు చెప్తున్నారు. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే కొత్త రేషన్​కార్డులు ఇస్తామని ప్రకటించడంతో మీ సేవా, గ్రామసభలు, మండల కార్యాలయాలు, ఎండీవో కార్యాలయాల ద్వారా లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలామంది ఒకటికి మించి అప్లికేషన్లు పెట్టుకోవడంతో డూప్లికేషన్​సమస్య తలెత్తింది. ఈ మల్టీపుల్​అప్లికేషన్ల వల్ల ఎంక్వైరీ ప్రక్రియ లేటవుతోంది. వెరిఫికేషన్ పూర్తయిన అప్లికేషన్లు గిర్దావర్, తహసీల్దార్, ఏసీఎస్‌‌‌‌ఓ, డీసీఎస్‌‌‌‌ఓ లాగిన్‌‌‌‌ల ద్వారా ఆమోదం పొంది.. హైదరాబాద్‌‌‌‌లోని సివిల్ సప్లయ్స్ హెడ్ ఆఫీస్‌‌‌‌కు చేరుతున్నాయి. అక్కడ ఆమోదం పొందిన అప్లికేషన్లను ప్రతి నెలా 25వ తేదీలోగా డైనమిక్ కీ రిజిస్టర్‌‌‌‌లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత నెల నుంచి లబ్ధిదారులకు రేషన్ అందేలా చర్యలు చేపడుతున్నారు.

పెండింగ్ అప్లికేషన్లలో 80% క్లియర్.. 

ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు చేర్చడం కోసం, పెండ్లయిన తర్వాత కుటుంబసభ్యుల మార్పుల కోసం గత పదేండ్లలో ఏకంగా 20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 15,93,714 అప్లికేషన్లను అధికారులు క్లియర్ చేశారు. తద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌లో ఉన్న ఈ సమస్యకు కాంగ్రెస్​ప్రభుత్వం పరిష్కారం చూపినట్లయింది. గత పదేండ్లుగా మార్పుచేర్పులు లేకపోవడంతో 20 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌లో ఉంటూ వచ్చాయి. వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ యుద్ధప్రాతిపదికన 80 శాతం క్లియర్​చేసింది. ఇది గ్రేట్​అచీవ్‌‌‌‌మెంట్‌‌‌‌ అని సివిల్​సప్లయ్స్​శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ నెలలో మరో 2 లక్షల కార్డులు.. 

మీ సేవా సెంటర్ల ద్వారా పెట్టుకున్న అప్లికేషన్లలో డూప్లికేషన్, ఇతర సమస్యలు లేకపోవడంతో అవి వేగంగా పరిష్కారమవుతున్నాయి. మీ సేవా ద్వారా 4 లక్షల అప్లికేషన్లు రాగా.. వీటిలో 1, 57,401 అప్లికేషన్లకు ఇప్పటివరకు ఆమోదం లభించింది. ఈ కార్డుల కింద 3,24,968 మంది లబ్ధిదారులకు ఈ నెల నుంచి రేషన్ అందనుంది. గత ఫిబ్రవరి 7 నుంచే  మీ సేవాలో  రేషన్​ కార్డుల అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభించారు. మీసేవా సాఫ్ట్‌‌‌‌వేర్ డూప్లికేట్ అప్లికేషన్లను తిరస్కరించడంతో, ఈ విధానంలో వెరిఫికేషన్ వేగంగా జరుగుతోంది. ఈ నెల 25వ తేదీ నాటికి మరో 2 లక్షల అప్లికేషన్లకు ఆమోదం లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.