-as-Lashkars-in-the-Irrigation-Department_KHfDkI6dAF.jpg)
హైదరాబాద్, వెలుగు: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)లను ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో లష్కర్‌లుగా నియమించే ప్రక్రియ వేగవంతమైంది. వానాకాలం సీజన్ వచ్చేలోపు లష్కర్‌ల నియామకంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదనలు పంపింది. వీఆర్‌ఏలను లష్కర్‌లుగా నియమిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇదివరకే ప్రారంభించినా పలు కారణాలతో ఆలస్యమైంది. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో 3,357 మంది లష్కర్‌లు, ఇతర కింది స్థాయి సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఇందులో 200లకు పైగా పోస్టులు శ్రీశైలం, శ్రీరామసాగర్ ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇవ్వనున్నారు. అవి పోను 3 వేలకు పైగా పోస్టులను వీఆర్‌ఏలతోనే భర్తీ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వీఆర్‌ఏలకు రూ.10,500ల గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇరిగేషన్‌కు అవసరమైన పోస్టుల్లో వీఆర్‌ఏలను నియమిస్తే వారికి స్కేల్ ఇచ్చే అవకాశముంది. వీఆర్‌ఏలను డిపార్ట్‌మెంట్‌లో విలీనం చేసుకోవాలా లేక డిప్యుటేషన్‌పై నియమించాలా అనేదానిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద కాలువలు, ఓటీల(తూముల) పరిరక్షణ, నిర్వహణకు లష్కర్‌లు కీలకమని, దీంతో ఆ పోస్టుల భర్తీపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు.