Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్ షోలు డౌటేనా? హైకోర్టు తీర్పుతో మారుతున్న టికెట్ రేట్ల లెక్కలు!

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్ షోలు డౌటేనా? హైకోర్టు తీర్పుతో మారుతున్న టికెట్ రేట్ల లెక్కలు!

సంక్రాంతి పండగ వేళ తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ ధరల వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషల్ లో వచ్చిన  'ది రాజా సాబ్' చిత్రానికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. టికెట్ ధరల పెంపునకు నో చెప్పింది. ఇప్పుడు న్యాయస్థానం తీర్పు ప్రభావం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాపై కూడా పడేలా కనిపిస్తోంది. పాత ధరలకే టికెట్లు అమ్మాలన్న కోర్టు తీర్పుతో అటు నిర్మాతలు, ఇటు అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

హైకోర్టు ఆగ్రహం..

తెలంగాణ ప్రభుత్వం 'ది రాజా సాబ్' సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. టికెట్ రేట్ల పెంపు లేదా బెనిఫిట్ షోల అనుమతిపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం జిల్లా కలెక్టర్లకు లేదా సిపిలకు మాత్రమే ఉంటుందని, హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం లేదని కోర్టు దృష్టికి విజయ్ గోపాల్ తీసుకువచ్చారు. 

 'రాజా సాబ్'కు భారీ షాక్!

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన  కోర్టు టికెట్ రేట్లు పెంచబోమని గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి స్వయంగా ప్రకటించినా, అధికారులు మెమోలు ఎలా ఇస్తున్నారని నిలదీసింది.  "పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారు? మేము కూడా సినిమాలకు వెళ్తాము, మాకు రేట్లు తెలుసు" అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  'ది రాజా సాబ్' టికెట్ రేట్ల పెంపునకు నో చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేసింది. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది. దీంతో 'రాజాసాబ్' నిర్మాతకు కోర్టులో తీవ్ర నిరాశ ఎదుదైనట్లైంది.

చిరంజీవి సినిమాకు 'తెలంగాణ' టెన్షన్!

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతికి కానుకుగా జనవరి 12న విడుదలవుతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'UA 13+' సర్టిఫికెట్ లభించింది. నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రంపై చాలా నమ్మకంతో ఉన్నారు. సినిమాలో నయనతారతో చిరంజీవి కెమిస్ట్రీ, వెంకటేష్‌తో వచ్చే ఫన్నీ సీన్లు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. అయితే, తాజా కోర్టు తీర్పు ఈ సినిమాపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.

ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో నిరాశ..

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జనవరి 11 సాయంత్రం వేసే ప్రీమియర్ షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. అక్కడ మెగా అభిమానులు హ్యాపీగా ఉన్నారు.  'రాజా సాబ్' విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల, చిరంజీవి సినిమాకు కూడా తెలంగాణలో టికెట్ ధరల పెంపు ,  ప్రీమియర్ షోల అనుమతి లభించడం కష్టమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే తెలంగాణలోని మెగా అభిమానులకు పెద్ద నిరాశే అని చెప్పాలి.

పాత ధరలే శరణ్యమా?

భారీ బడ్జెట్ సినిమాల పెట్టుబడి తిరిగి రావాలంటే టికెట్ ధరల పెంపు అవసరమని నిర్మాతలు వాదిస్తున్నారు. అయితే సామాన్యుడిపై భారం పడకూడదని న్యాయస్థానం భావిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టాక్ ఉంది. మరి తెలంగాణలో చిరంజీవి సినిమా కూడా పాత ధరలకే ప్రదర్శితం అవుతుందా? లేక నిర్మాతలు మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..