జింఖానా గ్రౌండ్ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు

జింఖానా గ్రౌండ్ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు

హైదరాబాద్, వెలుగు: జింఖానా గ్రౌండ్స్​లో తొక్కిసలాటకు హెచ్​సీఏ నిర్లక్ష్యమే కారణమని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ అన్నారు. ఇందులో పోలీసుల వైఫల్యమేమీ లేదని చెప్పారు. ‘‘టికెట్ల విక్రయం విషయంలో హెచ్​సీఏను ముందుగానే హెచ్చరించాం. అయినా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకోకుండా హెచ్​సీఏ ఏకపక్షంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. తొక్కిసలాట జరిగి పలువురు గాయపడడం దురదృష్టకరం” అని అన్నారు. గురువారం జింఖానా గ్రౌండ్స్​ లో జరిగిన ఘటన తర్వాత హెచ్​సీఏ ప్రెసిడెంట్ అజరుద్దీన్, సెక్రటరీ విజయానంద్, క్రీడల శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, వివిధ శాఖల అధికారులతో రవీంద్రభారతిలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఘటనకు హెచ్​సీఏనే కారణం. పోలీసుల వైఫల్యం లేదు. మ్యాచ్‌‌కు సంబంధించి టికెట్ల విక్రయం సహా అన్ని ఏర్పాట్లు వాళ్లే చేసుకోవాలి. టికెట్ల విషయంలో అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదు రావడంతో నిన్న హెచ్‌‌సీఏ అధికారులతో మాట్లాడాం. దాంతో కౌంటర్లలో అమ్మకానికి ఉంచారు. ఏర్పాట్లు చేయలేదు. హెచ్‌‌సీఏ ముందుగానే ప్రభుత్వాన్ని సంప్రదించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే ఊకోం” అని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. 

సీఎం దృష్టికి తీసుకెళ్తాం... 

ఈ ఘటనపై కమిటీ వేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. గాయపడినోళ్ల ట్రీట్ మెంట్ ఖర్చులు హెచ్​సీఏనే భరిస్తుందన్నారు. టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్టు తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనను సీఎం కేసీఆర్‌‌ దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. అవసరమైతే ఉప్పల్‌‌ స్టేడియానికి లీజుకు ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పారు.

మా తప్పు లేదు: అజరుద్దీన్ 

తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని, ఇందులో తమ తప్పేమీ లేదని అజరుద్దీన్​ చెప్పారు. జింఖానా గ్రౌండ్స్​లో టికెట్లు విక్రయి స్తున్నామని, భద్రత కల్పించాలని పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అసలేం జరిగిందనే దానిపై ప్రభుత్వానికి రిపోర్టు అందజేస్తామన్నారు. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని, ఆ వివరాలు శుక్రవారం మీడియాకు వెల్లడిస్తామన్నారు. ‘‘మూడేండ్ల తర్వాత మ్యాచ్‌‌ జరుగుతుండడంతో టికెట్ల కోసం ఎక్కువ మంది రావడంతోనే సమస్య ఎదురైంది. ‘‘మ్యాచ్‌‌ నిర్వహణ అంటే అంత తేలిక కాదు. కూర్చొని మాట్లాడుకున్నంత ఈజీ కాదు. నా ఏజ్‌‌ 59 ఏండ్లు.. పదేండ్లు కాదు. ఏం చేయాలో నాకు తెలుసు. రూల్స్‌‌ ప్రకారం ఏం చేయాలో అన్నీ చేశాను. కానీ కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు” అని తెలిపారు.

పోలీసుల వైఫల్యం లేదు 

టికెట్ల ఇష్యూ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు. మాకు హెచ్​సీఏ సరైన సమాచారం ఇవ్వలేదు. టికెట్ల వ్యవహారంలో బేగంపేట పోలీస్​ స్టేషన్​లో 3కేసులు పెట్టాం. బాధితుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తు న్నాం. అజరుద్దీన్​, నిర్వాహకులను నిందితులుగా చేర్చాం.

‌‌‌- డీఎస్​ చౌహాన్​, అడిషనల్​ సీపీ,  లా అండ్​ ఆర్డర్