ఉమ్మడి జిల్లాలో రూ.155 కోట్ల నష్టం

ఉమ్మడి జిల్లాలో రూ.155 కోట్ల నష్టం
  • నీటమునిగిన 65 వేల ఎకరాలు
  • దెబ్బతిన్న రోడ్లు, కరెంట్‌‌‌‌ పోల్స్‌‌‌‌

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌లో ఇటీవల కురిసిన వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. 1983 తర్వాత గోదావరిలోకి భారీగా వరద రావడంతో జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాలన్నీ అతలాకుతమయ్యాయి. 26 గ్రామాలు ముంపునకు గురయ్యా యి. 2,192 కుటుంబాలపై వరద ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం నిజామాబాద్‌‌‌‌లో రూ.150 కోట్లు, 
కామారెడ్డిలో రూ.5 కోట్లు నష్టం వాటిల్లింది. 

కన్నీరు మిగిల్చిన వరద
వారం రోజు పాటు కురిసిన వానలు ఇటు రైతులు, అటు జనానికి కన్నీరు మిగిల్చాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 51 మండలాల్లో  8,634 మంది రైతులకు చెందిన 65 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. నిజామాబాద్‌‌‌‌లో 59,342 ఎకరాలు, కామారెడ్డిలో 5,338 ఎకరాలు దెబ్బతిన్నాయి. బాల్కొండ, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో మండలాల్లో భారీ నష్టం జరిగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ  డివిజన్లలో కూడా పంటలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల ఆరు రోజుల పాటు పొలాల్లోనే వరద నీరు ఉండడంతో పంటలు కుళ్లిపోయాయి. దీంతో రైతులు మళ్లీ నాట్లు వేసే పరిస్థతులు ఉత్పన్నమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,695 ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా, 26 ఇండ్లు పూర్తి  ధ్వంసమయ్యాయి.  

కొట్టుకుపోయిన పోల్స్.. 
వరదలకు విద్యుత్‌‌‌‌ శాఖకు కూడా భారీ నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 772 కరెంట్‌‌‌‌ పోల్స్‌‌‌‌ ధ్వంసం కాగా, 263  ట్రాన్స్​ఫార్మర్లు  దెబ్బతిన్నాయి. దీంతో ఎలక్ట్రిసిటీ డిపానర్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు రూ.75  లక్షల మేర నష్టం జరిగింది. విద్యుత్ లైన్లు పాడవడంతో 48 గంటల పాటు రెండు మండలాలకు సప్లై బంద్ అయింది. జిల్లా పంచాయతీరాజ్ రోడ్లు 216 చోట్ల దెబ్బతిన్నాయి. ఫలితంగా రూ.7.25 కోట్ల నష్టం జరిగింది. 63 ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ రోడ్లు పూర్తిగా దెబ్బతినగా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా రూ.60 కోట్ల నష్టం వచ్చింది.  

వరదలు దెబ్బతీశాయ్
ఎన్నో ఆశలతో రూ.లక్షలు పెట్టుబడి పెట్టి రెండెకరాల్లో సోయా సాగు చేశాను. ఇంకో నాలుగు వారాల్లో పంట కోసేందుకు ఏర్పాట్లు చేసుకున్నా. ఇంతలోనే వర్షాలతో పొలం నిండా వరదనీరు చేరింది. ఆశించిన దిగుబడులు రావడం కష్టమే.
‌‌‌‌‌‌‌‌- గంగారెడ్డి, రైతు, అంకాపూర్​   

పెట్టుబడి నష్టం పోయా
నాట్లు దశలోనే వరదనీరు రావడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు మొత్తం పోయినట్టే.. వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. 
- రవిరాజ్, రైతు, అంకాపూర్​