రియల్టర్లతో సబ్​రిజిస్ట్రార్ల  కుమ్మక్కు

రియల్టర్లతో సబ్​రిజిస్ట్రార్ల  కుమ్మక్కు

ఖమ్మం, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ముందస్తు ప్లాన్​ప్రకారం రెగ్యులర్​సబ్​ రిజిస్ట్రార్​ సెలవు పెడుతున్నారు. ఆ విషయాన్ని ముందుగానే కావాల్సిన వాళ్లందరికీ చెప్పి, ఇన్​చార్జిగా ఒక రోజు డ్యూటీ చేసే కింది స్థాయి సిబ్బందితో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. అలా వచ్చిన అక్రమ సొమ్ములో వాటాలు పంచుకుంటున్నారు. చాలా సబ్​ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇలాంటి వ్యవహారం కామన్​గా మారింది. యావరేజీగా15 నుంచి 20 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగే ఆఫీసుల్లో, రెగ్యులర్​సబ్​రిజిస్ట్రార్ సెలవు పెట్టిన రోజు 50 నుంచి 60 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్​అవుతున్నాయి. ఏదో ఒక సమయంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడినా, ఉన్నతాధికారులు ఇన్​చార్జిగా పనిచేసిన వ్యక్తిని సస్పెండ్​ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అయితే ప్రభుత్వ భూమి తప్పించి, ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఏ రిజిస్ట్రేషన్​ అయినా ఒకసారి పూర్తయితే, దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేకపోవడం అవినీతి ఆఫీసర్లకు వరంగా మారుతోంది.  

ప్లాన్ ​ప్రకారం కుమ్మక్కయి...

రాష్ట్రంలో లే అవుట్ లేని ప్లాట్లకు రిజిస్ర్టేషన్లను నిషేధిస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ డిపార్ట్​మెంట్​ఐజీ 2020 ఆగస్టు 26న జీ2/257/2019 పేరిట మెమో జారీ చేశారు. తర్వాత డిసెంబర్ 19న దీనిని సవరిస్తూ ఎల్ఆర్ఎస్ కట్టిన వాటికి, లింక్ డాక్యుమెంట్లు ఉన్నవాటికి, గతంలో రిజిస్ర్టేషన్లు జరిగిన వాటికి రిజిస్ర్టేషన్ చేయాలని మరో మెమో రిలీజ్ చేశారు. దీంతో లే అవుట్ లేని వెంచర్లలోని ప్లాట్లతో పాటు పార్ట్ రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయి. డాక్యుమెంట్ టు డాక్యుమెంట్ మాత్రమే రిజిస్ర్టేషన్లు జరిగాయి. ఈ ఆర్డర్​ను సవాల్ చేస్తూ నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ హైకోర్టులో రిట్ పిటిషన్ డబ్ల్యూపీ 9248/2021 ఫైల్ చేసింది. దీనిని విచారించిన కోర్టు తదుపరి ఆర్డర్స్ ఇచ్చేంత వరకు రిజిస్ర్టేషన్లు చేయాలని 2021 ఏప్రిల్ 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆగస్టు 23న స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ శాఖ ఐజీకి రిజిస్ర్టేషన్లను నిషేధించే అధికారం లేదని స్పష్టం చేసింది. డబ్ల్యూపీ 9248/2021 ప్రకారం యథావిధిగా రిజిస్ర్టేషన్లు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆర్డర్స్ మీద నిజాంపేట మున్సిపల్ ఆఫీసర్లు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. దీనిని విచారించిన ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆర్డర్స్ మీద స్టే విధిస్తూ తదుపరి ఆర్డర్స్ ఇచ్చేంత వరకు రిజిస్ర్టేషన్లు నిలిపివేయాలని ఈ ఏడాది మే 19న ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎలాంటి లే అవుట్ లేకుండా జీపీ వెంచర్లు వేసిన రియల్టర్లు, సబ్​రిజిస్ట్రార్లతో కుమ్మక్కై ఒక ప్లాన్​ ప్రకారం ఇన్​చార్జిలతో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం నడిపిస్తున్నారు. 

ప్రాసెస్ ​కంప్లీట్​ అయితే చాలని..

ప్రభుత్వ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వుల కారణంగా 2020కు ముందు వేసిన జీపీ వెంచర్లలో ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో రియల్​ వ్యాపారులు వాటిని వదిలించుకునేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్​ కంప్లీట్ అయితే, తమకు అడ్డు ఉండదనే ఆలోచనతో ఈ ఎత్తులు వేస్తున్నారు. ఆఫీసర్లు కూడా సస్పెండ్​అయినా పర్లేదు, ఒకట్రెండు నెలల్లో మళ్లీ పోస్టు తెచ్చుకోవచ్చన్న ధీమాతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. 

ఒక్కోచోట ఒక్కో విధంగా...

మధిర పట్టణంలో 277 గజాల్లో మధిర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉంది. నిజాం కాలం నాటి భవనం కావడంతో, కొన్నేండ్ల క్రితం కిరాయి బిల్డింగ్ కు మార్చి, పాత బిల్డింగ్​ను కూల్చి అదే ప్లేస్​ లో కొత్త భవనం నిర్మిస్తున్నారు. గతేడాది కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్ ను పట్టణానికి చెందిన పూసపాటి ఉమామహేశ్వరరావుతో పాటు అతడి భార్య ఝాన్సీ గిఫ్ట్ రిజిస్ట్రేషన్​ చేశారు. ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్​ సత్యానందం ఈ పని చేశాడు. కొన్ని నెలల తర్వాత ఆ రిజిస్ట్రేషన్ పేపర్లను అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్​, సీఎస్​ సోమేష్​ కుమార్​, కలెక్టర్​ గౌతమ్​ తో పాటు ఎక్సైజ్​ ఉన్నతాధికారులకు నోటీసులు పంపాడు. తన పేరు మీద రిజిస్ట్రేషన్​ చేసిన భవనాన్ని స్వాధీనం చేయాలని కోరాడు. దీంతో ఉన్నతాధికారులు ఆ రిజిస్ట్రేషన్​ను రద్దుచేసి ఉమామహేశ్వర్​ రావు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఇన్​చార్జిగా ఈ రిజిస్ట్రేషన్ ను పూర్తిచేసిన సత్యానందంను సస్పెండ్ చేశారు. 

నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో సాధారణంగా రోజుకు 15 నుంచి 20 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతాయి. జూన్​ 13న సబ్ రిజిస్ట్రార్ హైదరాబాద్ లో ట్రైనింగ్ పేరిట ఒక రోజు సెలవు పెట్టి వెళ్లగా, జూనియర్ అసిస్టెంట్ ఇన్​చార్జిగా బాధ్యతలు తీసుకొని దాదాపు 52 రిజిస్ట్రేషన్లు చేశారు. మరోసారి జులై 8న 62 డాక్యుమెంట్లు ఇన్​చార్జి హయాంలోనే జరిగాయి. ఈ రెండు సందర్భాల్లో లక్షల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. 
గతేడాది సెప్టెంబర్ 21, 22 తేదీల్లో భువనగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రెగ్యులర్​సబ్​ రిజిస్ట్రార్​సెలవు పెట్టారు. ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్​ వెంకటేశ్వర్లు డ్యూటీలో ఉండగా 200కు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్​చేశారు. అప్పట్లో ఆయనపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేశారు.

రెండేండ్లలో ఖమ్మం రూరల్​సబ్​ రిజిస్ట్రార్​గా ఇద్దరు ఆఫీసర్లు ఇన్​చార్జీలుగా పనిచేశారు. ఈ సమయంలో వందల సంఖ్యలో అక్రమ రిజిస్ట్రేషన్లు పూర్తిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎంక్వైరీ చేసిన హయ్యర్​ ఆఫీసర్లు, ఆ ఇద్దరిని సస్పెండ్​ చేశారు.  ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్​రిజిస్ట్రార్​ ఆఫీసులో గత నెలలో రిజిస్ట్రేషన్​ చేసిన డాక్యుమెంట్ల సంఖ్య 20లోపు మాత్రమే. కానీ, జూన్​13న ఒకే రోజు ఏకంగా 199 డాక్యుమెంట్లు, జూన్​14న 138 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్​చేశారు. ఆ రెండు రోజులు రెగ్యులర్​ సబ్​ రిజిస్ట్రార్ రాము సెలవులో ఉండడంతో ఇన్​చార్జిగా ఉన్న సీనియర్​అసిస్టెంట్ కిరణ్ ఈ రిజిస్ట్రేషన్లు పూర్తిచేశారు. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా లే అవుట్లకు పర్మిషన్లు లేని జీళ్లచెర్వు, మంచుకొండ, రఘునాథపాలెంకు చెందిన జీపీ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్​ చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి రెండు రోజుల పాటు ఇన్​చార్జిగా ఉన్న కిరణ్ ను సస్పెండ్ చేశారు. అయినా రిజిస్ట్రేషన్లు మాత్రం పూర్తయ్యాయి. 

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట సబ్ రిజిస్ర్టార్ ఆఫీసులో నిరుడు మే 11న ఇల్లీగల్ రిజిస్ర్టేషన్లు జరిగాయి. కొంతమంది లీడర్లకు చెందిన అక్రమ వెంచర్లలో పార్ట్ రిజిస్ర్టేషన్లు చేసేందుకు అప్పటి సబ్ రిజిస్ర్టార్ ఇక్బాల్ ఒప్పుకోలేదు. దీంతో  ఉన్నతాధికారులు లీడర్లతో కుమ్మక్కై సబ్ రిజిస్ర్టార్ ను లీవ్ లో పంపించారు. మంచిర్యాల సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రతన్ కు, లక్సెట్టిపేట ఇన్​చార్జి సబ్ రిజిస్ర్టార్ గా బాధ్యతలు అప్పగించారు. ఆయన కోవిడ్ లాక్ డౌన్ రూల్స్​ను బ్రేక్​ చేసి అర్ధరాత్రి అక్రమ రిజిస్ర్టేషన్లు చేయడం వివాదాస్పదమైంది. మొత్తం 64 డాక్యుమెంట్లకు 39 డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు ఎంక్వైరీ నిర్వహించి రెండు రోజులకే రతన్ ను సస్పెండ్ చేశారు. తర్వాత నెల రోజులకే ఆయనను మళ్లీ జూనియర్ అసిస్టెంట్ గా విధుల్లోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి.