రెగ్యులరైజేషన్​ టార్గెట్ 22 వేల కోట్లు

రెగ్యులరైజేషన్​ టార్గెట్ 22 వేల కోట్లు

అప్లికేషన్లతోనే 255 కోట్లు వచ్చినయ్​..

ఎల్​ఆర్​ఎస్​తో ఖజానా  నింపుకోవాలని సర్కార్  ప్లాన్​

ముగిసిన అప్లికేషన్ల గడువు

మొత్తం అప్లికేషన్లు:  25,59,562

జనవరి 31లోగా  ఫీజు చెల్లించాల్సిందే

కరోనా కష్టకాలంలో పైసలు ఏడికెంచి తేవాలంటున్న జనం

హైదరాబాద్​, వెలుగు: ఖాళీ ప్లాట్ల రెగ్యులరైజేషన్​ పేరిట ప్రజల నుంచి భారీ మొత్తాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ఇప్పటికే నిర్ణయించిన ఎల్ఆర్​ఎస్​ ఫీజుల ప్రకారం సుమారు రూ. 22 వేల కోట్లకుపైగా వసూలు చేయాలని అంచనా వేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో లాక్​డౌన్​తో ఖజానాకు ఏర్పడిన లోటును పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆగస్టు 31న ప్రారంభమైన  ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్ల  తుది గడువు అక్టోబర్​ 31తో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అనధికార లేఔట్లలో ఉన్న ఖాళీ ప్లాట్ల రెగ్యులరైజేషన్​ కోసం  అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్లలో కలిపి  25,59,562 అప్లికేషన్లు  వచ్చాయి. వీటితో అప్లికేషన్ల ఫీజు పేరిటనే ప్రభుత్వానికి రూ. 255.95 కోట్లు ఆదాయం సమకూరింది. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధి నుంచి 20 లక్షలకుపైగా అప్లికేషన్లు రాగా.. కార్పొరేషన్ల నుంచి మరో నాలుగు లక్షలకుపైగా  అప్లికేషన్లు అందాయి. ఈ అప్లికేషన్లను  వచ్చే మూడు నెలల్లో(జనవరి 31లోగా) పరిష్కరించాల్సి ఉంది.

అంచనాకు మించి అప్లికేషన్లు రావడంతో రెగ్యులరైజేషన్‌తో వచ్చే  ఆదాయంపై ప్రభుత్వ అంచనాలు మారిపోయాయి. తొలుత సర్కార్​ రూ. 10 వేల కోట్లుగా పెట్టుకున్న టార్గెట్​ కాస్తా ఇప్పుడు డబుల్​ అయింది. జనవరి 31లోగా రెగ్యులరైజేషన్​ ఫీజు చెల్లించాల్సి ఉన్నందున ఆ లోపు స్థానిక సంస్థల ఆఫీసర్లు అప్లికేషన్ల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. అప్లికేషన్ల సంఖ్య 25 లక్షలు దాటిపోవడంతో వీటి స్క్రూటినీ  సవాల్​గా మారింది. వీటిలో అత్యధికంగా గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో 1,06,891.. గ్రేటర్​ వరంగల్​పరిధిలో 1,01,033.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 51,395 అప్లికేషన్లు అందాయి. వీటి పరిశీలనకు స్పెషల్​ గైడ్​లైన్స్,​ పరిశీలన బృందాల సంఖ్య పెంచే ఆలోచనలో సర్కార్​ ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా రెగ్యులరైజేషన్​ ద్వారా రూ. 22 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకోగా..  అప్లయ్​ చేసుకున్న ప్రజలు మాత్రం కరోనా కష్టకాలంలో ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ఆందోళన
చెందుతున్నారు.

ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్ల వివరాలు

గ్రామ పంచాయతీలు    10,83,394

మున్సిపాలిటీలు          10,60,013

మున్సిపల్ కార్పొరేషన్లు​ 4,16,155

మొత్తం                       25,59,562

 

ఎక్కువగా ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్లు వచ్చిన కార్పొరేషన్లు


గ్రేటర్​ హైదరాబాద్           1,06,891

గ్రేటర్​ వరంగల్​                 1,01,033

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ 51,395

బడంగ్​పేట కార్పొరేషన్        46,894

నిజామాబాద్​ కార్పొరేషన్​   33,513

కరీంనగర్ కార్పొరేషన్​       26,777