మూడేండ్లుగా నష్టపోతున్నాం

మూడేండ్లుగా నష్టపోతున్నాం

మహారాష్ట్రలో రెండోరోజు రైతుల దీక్ష

మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్, డౌన్ స్ట్రీం నీళ్లతో మూడేండ్లుగా నష్టపోతున్నామని మహారాష్ట్ర రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచలోని 30 గ్రామాలకు చెందిన సుమారు 300 మంది రైతులు సిరోంచ తాలూకా ఆఫీస్ ఎదుట బుధవారం నిరసన కొనసాగించారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మేడిగడ్డానే క్యాకియా.. కిసానోంకో రోడ్ పర్ లాయా’ అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు.

సిరోంచ తహసీల్దార్ రైతులతో మాట్లాడినా వినిపించుకోలేదు. సమస్య పరిష్కరించాలని గతంలో ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇస్తే పట్టించుకోలేదన్నారు. ఉన్నతాధికారులు రావాల్సిందేనని భీష్మించారు. తమకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకైనా సిద్ధమని హెచ్చరించారు. భూ సేకరణ పూర్తి చేయకుండా, నీట మునిగిన పంటలకు పరిహారం ఇవ్వకుండా రెండు ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని మండిపడ్డారు.