- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
తొర్రూరు/ వర్ధన్నపేట/ జనగామ/ స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: ప్రజలు రాష్ట్రంలో పదేళ్ల రావణాసుర పాలనకు ముగింపు పలికి ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట, జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అర్హులందరికీ ఇళ్లు, స్థలాలు అందిస్తామన్నారు. తొర్రూరుకు ఫైర్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తీసుకొస్తామని, వర్ధన్నపేట అభివృద్ధికి రూ.10 కోట్లు అదనంగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు.
